ఇంటర్ మినిస్ట్రియల్ ముందు ‘మామునూరు’ ఎయిర్‌‌ పోర్టు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇంటర్ మినిస్ట్రియల్ ముందు ‘మామునూరు’ ఎయిర్‌‌ పోర్టు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  •     ఆదిలాబాద్, సాగర్‌‌ల్లో ఎయిర్ స్ట్రిప్‌ల అభివృద్ధి
  •     మీడియా చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని మామునూరు (వరంగల్) ఎయిర్‌‌పోర్టుకి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఈ  మామునూరు ఎయిర్‌‌పోర్టు ఫైల్ ఇంటర్ మినిస్ట్రియల్ వద్ద ఉన్నట్టు చెప్పారు. దీనితో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌‌లలో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌లను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో కేంద్రమంత్రి చిట్‌చాట్ చేశారు. దేశవ్యాప్తంగా విమానయాన సేవలను మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించిన ‘ఉడాన్ 2.0’పథకాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. 

ఈ పథకం కింద ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు నడిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. విమానయాన రంగంలో సరికొత్త విప్లవం తీసుకువస్తూ.. దేశంలోని 9 ప్రాంతాల్లో సీ ప్లేన్ పోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో సీ ప్లేన్ ట్రయల్స్ జరుగుతున్నాయని వివరించారు. స్పైస్ జెట్ సంస్థ “స్కై హబ్” పేరుతో సీ ప్లేన్స్​ను నడపడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.