భూములు తీసుకున్నరు.. ఊరును వదిలేసిన్రు

భూములు తీసుకున్నరు.. ఊరును వదిలేసిన్రు


మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం పోతపల్లిలోని 85 శాతం సాగు భూములను ప్రభుత్వం సేకరించడంతో ఊరు ఆగమైంది. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని పదిహేనేండ్లుగా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో పోతపల్లి, అంకత్​పల్లి, శాంతాపూర్ గ్రామాలు కలిపి పోతపల్లి  గ్రామపంచాయతీగా ఉండేవి. 1,552 ఎకరాల విస్తీర్ణం ఈ గ్రామ రెవెన్యూ శివార్లలో ఉండేది. పోతపల్లి విస్తీర్ణం 578 ఎకరాలు ఉంటే.. మిగిలిన భూములు శాంతాపూర్, అంకత్​పల్లిలో ఉన్నాయి. పోతపల్లిలోని 458 ఎకరాల వ్యవసాయ భూములు ప్రాజెక్టు కింద మునిగిపోయాయి. భూములు పోయినవాళ్లలో మెజారిటీ రైతులు ఎకరం నుంచి ఐదెకరాల లోపు ఉన్నవాళ్లే.  గ్రామంలో సుమారు 600 జనాభా ఉండగా, 60 శాతం ఎస్సీలే. పెద్ద కులస్తులకు చెందిన 120 ఎకరాలే ప్రస్తుతం మిగిలి ఉంది. 

త్రీమెన్​ కమిటీ రిపోర్టులు బుట్టదాఖలు 

పోతపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించాలా వద్దా అనే విషయంపై మూడుసార్లు త్రీమెన్ కమిటీ వేసి సర్వే చేపట్టారు. 2004–-05లో మొదటిసారి సర్వే చేసిన ఆఫీసర్లు ఉమ్మడి జీపీని పరిగణనలోకి తీసుకొని పోతపల్లిని ముంపు గ్రామంగా గుర్తించలేదు. గ్రామస్తులు ఆందోళనలు చేయడంతో 2009లో రెండోసారి త్రీమెన్​ కమిటీ సర్వే చేసింది. పోతపల్లి పరిస్థితిని చూసి నివ్వెరపోయిన ఆఫీసర్లు ముంపు గ్రామంగా గుర్తిస్తూ రూ.26.21 కోట్లతో ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ రిపోర్టు తయారు చేసి పంపించారు. ఈ ఫైల్ ఆఫీసుల్లో మాయం కావడంతో 2011లో మూడోసారి త్రీమెన్ కమిటీ సర్వే నిర్వహించింది. రూ.16 కోట్ల బడ్జెట్​తో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రిపోర్టును ప్రభుత్వానికి పంపించింది. కానీ గ్రామంలో మిగిలిన భూములను కాపాడుకునేందుకు కొంతమంది పెద్దలు తమ పలుకుబడిని ఉపయోగించి ముంపు గ్రామం కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా గ్రామంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయడంతో పాటు వడ్డీ లేని, ష్యూరిటీ లేని, సబ్సిడీ లోన్లు ఇప్పించి ఉపాధి కల్పిస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ ప్రపోజల్స్​ను గ్రామస్తులు వ్యతిరేకించారు. అప్పటినుంచి గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నా పోతపల్లిని పట్టించుకున్న నాథుడే లేడు. 

దిక్కు తోచని స్థితిలో జనం

ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సాగుభూములు పోయిన చిన్న, సన్నకారు రైతులతో పాటు భూమి లేని ఎస్సీ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. గతంలో పేదలు, ఎస్సీలు వ్యవసాయ కూలీ, ఉపాధిహామీ పనులు చేసి బతికేవారు. ప్రాజెక్టు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కరువయ్యాయి. గ్రామంలో ఉపాధిహామీ పనులు కూడా బంద్​అయ్యాయి. చాలామంది మంచిర్యాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి కూలినాలి చేస్తూ జీవిస్తున్నారు. ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ ఊరును చుట్టుముట్టడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ముంపు భూముల్లో బృహత్​ ప్రకృతివనం ఏర్పాటుకు భూ పరిశీలన కోసం వచ్చిన ఆఫీసర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. పోతపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించిన తర్వాతే ప్రకృతివనం పెట్టుకోవాలని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించి, ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీ అందించాలని కోరుతున్నారు.

రెండెకరాలు తీసుకున్నరు

నాకున్న రెండెకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పోయింది. ఎకరానికి రూ. 1.4 లక్షల చొప్పున ఇచ్చిన్రు. భూములు తీసుకున్నప్పుడు ఊరును కూడా లేపుతమని చెప్పిన్రు. ఇండ్లు కట్టిస్తం.. కూలి డబ్బులు ఇస్తం అన్నరు. ఇప్పుడు నాకు భూమిలేదు. కూలి పైసలు ఇయ్యలేదు. భూమి పోయినంక పనుల్లేక వచ్చిన పైసలు తిండికే ఒడ్సినయ్​. ఇప్పుడు అడుక్కొని తినే పరిస్థితి వచ్చింది. 
– ఆసాది బుచ్చమ్మ, గ్రామస్తురాలు

ఉపాధి పనీ లేకపాయే 

అదిత్తం.. ఇదిత్తం అని ఆశపెట్టి ఉన్న భూములు గుంజుకున్నరు. మా భూమి మాకు ఉంటే ఎవుసం చేసుకొని బతికేటోళ్లం. మాయమాటలు చెప్పి మా బతుకులను ఆగం జేసిన్రు. ఇప్పుడు ఎవుసం పనుల్లేవ్​, ఉపాధి పనులు సుత బంద్​ అయినయ్. పక్క ఊళ్లలో ఉపాధి పనులకు పోతే వాళ్లు రానిస్తలేరు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవుసం కూలి పనులు చేసి బతుకుతున్నం. – రత్నమ్మ, గ్రామస్తురాలు

ముంపు గ్రామంగా ప్రకటించాలి

ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములన్నీ పోయినయ్. ప్రాజెక్టు బ్యాక్​వాటర్​ గ్రామాన్ని చుట్టుముడుతోంది. వాగు పొంగితే లోతట్టు ప్రాంతంలో ఉన్న ఎస్సీ కాలనీలోకి నీళ్లొస్తున్నయ్​. ముంపు గ్రామంగా ప్రకటించి ఎక్కడైనా జాగలు ఇచ్చి ఇండ్లు కట్టియ్యాలె. ప్రభుత్వం చెప్పినట్లు సంక్షేమ పథకాలు వర్తింపచేసి, ఇంటికి పది లక్షల చొప్పున వడ్డీ లేని లోన్లు ఇయ్యాలె. అవసరమైతే మళ్లా సర్వే చేయాలె.  
– ఆసాది పురుషోత్తం, పోతపల్లి సర్పంచ్