కాలేజీల్లో ఫీజుల ఖరారుపై నామమాత్రపు విచారణ

కాలేజీల్లో ఫీజుల ఖరారుపై నామమాత్రపు విచారణ
  • రోజుకు 40 నుంచి 50 కాలేజీలతో హియరింగ్ 
  • ఒక్కో కాలేజీకి కేవలం 5 నిమిషాలే కేటాయింపు 
  • ఫీజు ముందే నిర్ణయించి మేనేజ్​మెంట్లకు చెప్తున్నట్లు ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ టెక్నికల్, ప్రొఫెషనల్ కాలేజీల్లో రానున్న మూడేండ్ల కాలానికి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫీజులు ఖరారు చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లతో హియరింగ్స్ నిర్వహిస్తోంది. త్వరలోనే ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఆర్కిటెక్చర్ తదితర కాలేజీలతోనూ నిర్వహించనుంది. అయితే టీఏఎఫ్ ఆర్సీ హియరింగ్స్ అన్నీ ఉత్తుత్తిగానే జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్క రోజే 40 కాలేజీల్లో హియరింగ్స్ నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించడంతో అదెట్ల సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

251 కాలేజీల్లో పూర్తి... 
రాష్ట్రంలోని 1,196 ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ తదితర 27 కోర్సులకు సంబంధించి 2022–23 నుంచి 2024–25 అకడమిక్ ఇయర్ వరకు మూడేండ్ల పాటు ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. దీని కోసం టీఏఎఫ్​ఆర్సీ ఆయా కాలేజీల నుంచి వివరాలు సేకరించింది. 2019–20 నుంచి 2021–22 సంవత్సరాలకు సంబంధించిన ఆదాయం, ఖర్చుల రికార్డులను తీసుకుంది. వీటి ఆధారంగానే రానున్న మూడేండ్ల ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే మేలోనే ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ ప్రారంభం కాగా, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఆధారంగా ఫీజులు ఖరారు చేయాలని ఏఐసీటీఈ ఆదేశాలివ్వడంతో దాన్ని ఆపేశారు. తిరిగి ఈ నెల 7 నుంచి హియరింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే 213 బీఈడీ, 25 ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం కాలేజీలు, 13  బీపీఈడీ కాలేజీల్లో హియరింగ్ పూర్తి చేసి ఫీజులనూ ఫైనల్ చేశారు. వీటిపై సర్కారు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. 

ఒక్క రోజే 49 కాలేజీలతో హియరింగ్.. 
ఫార్మసీ కాలేజీల మేనేజ్​మెంట్లతో ఆగస్టు 1 నుంచి 3 వరకు, ఆర్కిటెక్చర్ కాలేజీలతో 3న.. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలతో 10 నుంచి18 వరకు (ఐదు రోజులు) హియరింగ్ ఉంటుందని టీఏఎఫ్​ఆర్సీ ప్రకటించింది. రాష్ట్రంలో ఫార్మసీ కాలేజీలు 120 ఉండగా.. రోజుకు 40 కాలేజీల చొప్పున మూడ్రోజుల పాటు హియరింగ్ చేస్తామని అధికారులు చెప్పారు. 3న 9 ఆర్కిటెక్చర్ కాలేజీల్లోనూ హియరింగ్ ఉంటుందని పేర్కొన్నారు.  

జరుగుతున్నది ఇదీ.. 
ప్రధానంగా స్టాఫ్ జీతాలు, కాలేజీ నిర్వహణ ఖర్చుల ఆధారంగానే ఫీజులు ఖరారు చేస్తారు. 2020–21 పూర్తిగా కరోనాతోనే గడిచింది. 2021–22లోనూ సగానికిపైగా అట్లనే సాగింది. ఈ టైమ్ లో చాలా కాలేజీలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. కాలేజీలన్నీ బంజేయడంతో ఖర్చులేమీ కాలేదు. కానీ చాలా కాలేజీలు 2019–20తో పోలి స్తే 10 నుంచి 15 శాతమే ఖర్చులు తగ్గినట్లు లెక్కల్లో చూపెట్టాయి. అయితే కరోనా పేరుతో తగ్గిన ఖర్చునూ లెక్కలోకి తీసుకోని కమిటీ.. 2019–20 నాటి ఖర్చులతోనే ఫీజులను ఖరారు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కాలేజీల ప్రతినిధులు ఎంత పెంచాలని అనుకుంటున్న దానిపై కమిటీకి ప్రతిపాదనలు ఇవ్వగా, కమిటీ కూడా కాలేజీల ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ముందుగానే ఫీజులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విచారణ టైమ్ లో ఈ 2విషయాలను చెబుతున్నారని, ఏవైనా అభ్యంతరాలుంటే మరికొంత ఫీజు పెంచుతున్నారని సమాచారం. మెజార్టీ కాలేజీలకు ఫీజుల ఖరారుపై ముందుగానే చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ఎవరూ వ్యతిరేకించడం లేదని సమాచారం. కాలేజీలు ఇచ్చిన లెక్కల్లో తప్పులున్నాయని, జీతాలు ఇయ్యకున్నా ఇచ్చినట్లు రిపోర్టు ఇచ్చాయని లెక్చరర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

రోజుకు 40 కాలేజీలతో ఎట్ల సాధ్యం? 
రోజుకు 40 నుంచి 50 కాలేజీలతో కమిటీ హియరింగ్ ఎలా సాధ్యం? మూడేండ్ల రిపోర్టును నిమిషాల్లో ఎలా పరిశీలిస్తారో చెప్పాలి. రెండేండ్ల నుంచి కాలేజీల్లో ఎలాంటి  ఖర్చులు లేవు. కరోనా పేరుతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగుల జీతాలపై పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఫార్మ్ –16 పరిశీలిస్తే అన్ని లొసుగులు బయటకు వస్తాయి. రిపోర్టులు పరిశీలించి ఉద్యోగులకు మేలు జరిగేలా చూడాలి. 
- సంతోష్ కుమార్, టీఎస్​టీసీఈఏ అధ్యక్షుడు