మోదీ హయాంలో మహిళలకు రక్షణ కరువు: జైరాం రమేశ్

మోదీ హయాంలో మహిళలకు రక్షణ కరువు: జైరాం రమేశ్

న్యూఢిల్లీ:  ఇండియా ఆడబిడ్డలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫెయిల్ చేశారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఫైర్ అయ్యారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆయన తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు. జైరాం రమేశ్ ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ ను శిక్షించడానికి బదులుగా.. ఆయన కొడుకుకు ఎంపీ టికెట్ కేటాయించడం ద్వారా రివార్డు ఇచ్చినట్టుగా ఉందన్నారు. న్యాయం కోసం తమ కెరీర్స్ ను పణంగా పెట్టి రోజుల తరబడి వీధుల్లో నిరసనలు తెలిపిన మహిళలను చెంపదెబ్బ కొట్టినట్టుగా ఇది ఉందన్నారు. మోదీ కా పరివార్, నారీ శక్తి అనేవి ఉట్టి మాటలేనని దీంతో తేలిపోయిందన్నారు. 

కర్నాటకలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కూడా మోదీ మద్దతు ఇచ్చారన్నారు. ‘‘మోదీ పాలనలో దేశంలో మహిళలు ఎప్పుడైనా క్షేమంగా ఉంటారా? సూర్య ఘర్ యోజన కింద ఫ్రీ కరెంట్ ఇస్తామని అయోధ్యకు ప్రధాని మోదీ ఎందుకు అబద్ధం చెప్పారు? యూపీ యువతకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు?” అని ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు.