జెమీమాకు ప్రమోషన్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా బాధ్యతలు చేపట్టనున్న స్టార్ బ్యాటర్..!

జెమీమాకు ప్రమోషన్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా బాధ్యతలు చేపట్టనున్న స్టార్ బ్యాటర్..!

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్‏లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‎కు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్రమోషన్ దక్కనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా జెమీమా బాధ్యతలు చేపట్టనుంది. దీనిపై రేపో, మాపో ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. 2026 సీజన్‎లో ఢిల్లీ కెప్టెన్సీ పగ్గాలను భారత క్రికెటర్‎కు అప్పగించాలనుకుంటున్నామని ఢిల్లీ ఫ్రాంచైజ్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ కెప్టెన్‎గా జెమీమా ఎంపిక లాంఛనం కానుందని క్రీడా వర్గా్ల్లో ప్రచారం జరుగుతోంది. 

మెగ్ లానింగ్ ఔట్..!

డబ్ల్యూపీఎల్‎లో మెగ్ లానింగ్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లు ఫైనల్‎కు చేరుకుంది. కానీ మూడుసార్లు ఢిల్లీకి నిరాశే ఎదురైంది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణించిన డీసీ టైటిల్ ఫైట్‎లో చిత్తయింది. ఈ నేపథ్యంలో 2026 సీజన్ కోసం మెగ్ లానింగ్‎ను డీసీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో మెక్ లానింగ్‎ను యూపీ వారియర్స్ దక్కించుకుంది. దీంతో లానింగ్ స్థానంలో స్వదేశీ ప్లేయర్‌ కెప్టెన్‌గా ఉండాలనే ఉద్దేశంతో జట్టు పగ్గాలను జెమీమాకు అప్పగించాలని డీసీ మేనేజ్మెంట్ భావిస్తోంది. 

అంతేకాకుండా జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్‌ ప్రదర్శనలను కూడా డీసీ పరిగణలోకి తీసుకున్నట్లు టాక్. ఇవన్నీ సమీకరణాలను బేరీజు వేసుకుని చివరకు జెమీమాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డీసీ డిసైడ్ అయినట్లు సమాచారం. మరీ మూడుసార్లు ఫైనల్‎లో ఇంటి ముఖం పట్టిన డీసీ.. జెమీమా నాయకత్వంలోనైనా టైటిల్ ఆకలిని తీర్చుకుంటుందో లేదా చూడాలి. 2025, జనవరి 7 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.