కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ

కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ
  • కొంత మంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నరు: రాహుల్
  • కాంగ్రెస్​ పవర్​లోకి వస్తే దేశమంతా కుల గణన.. రిజర్వేషన్ల పెంపు
  • రైతులందరికీ రుణమాఫీ.. పేదింటి మహిళకు ఏటా రూ. లక్ష
  • నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, రూ. లక్ష సాయం
  • రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ప్లాన్​
  • ధనికులకు రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ.. 
  • పేదలకు ఎందుకు రుణ మాఫీ చేయలే?
  • రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర.. 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • నిర్మల్, గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ‘జనజాతర’ సభల్లో ప్రసంగం

నిర్మల్​/ఆదిలాబాద్/గద్వాల, వెలుగు: మోదీ సర్కార్​ కేవలం ధనికుల కోసమే పనిచేస్తున్నదని.. పేదలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ మండిపడ్డారు. కేంద్రంలో ధనికుల ప్రభుత్వాన్ని గద్దె దించి.. పేదలు, రైతులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల కోసం పనిచేసే పేదల సర్కార్​ను తీసుకొస్తామని చెప్పారు. ధనికులకు రూ. 16 లక్షల కోట్ల రుణాలు మోదీ మాఫీ చేశారని, పేదల రుణాలను ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ఆయన అన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఓ వైపు రాజ్యాంగ రక్షణ కోసం  కాంగ్రెస్ పోరాడుతుంటే.. మరోవైపు రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. అందుకే అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” అని ఆయన సూచించారు. 

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో నిర్వహించిన కాంగ్రెస్ ‘జన జాతర’ సభల్లో రాహుల్​గాంధీ ప్రసంగించారు. దేశంలో పేదలకు హక్కులతో పాటు జల్, జంగల్, జమీన్, రిజర్వేషన్, ఉద్యోగాలు లాంటి సదుపాయాలన్నీ రాజ్యాంగం ద్వారానే అందుతున్నాయని తెలిపారు. 

బీజేపీ లీడర్లు కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడగానే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తున్నరు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే రిజర్వేషన్లు పోతాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోదీ పనిచేస్తున్నరు. వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల హక్కులు లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయ్​. ప్రైవేటీకరణ ద్వారా మొత్తం రిజర్వేషన్లు తొలగించాలని మోదీ సర్కార్​ చూస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలి” అని రాహుల్​ అన్నారు.  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 50 శాతం రిజర్వేషన్ల పరిధిని పెంచుతామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లను 50 శాతానికి మించి పొడిగిస్తామని మోదీ ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. 

పేదలంటే పట్టదా?

దేశంలోని కొందరు ధనికుల కోసమే బీజేపీ సర్కార్​ పనిచేస్తున్నదని, వాళ్ల రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, పేదలకు మాత్రం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేం పేదలకు సహాయంతో పాటు రుణమాఫీ చేసి రైతులకు ఖర్చులు తగ్గిస్తామంటే మీడియాతోపాటు బీజేపీ వాళ్లు సోమరిపోతులను చేస్తున్నరని అంటున్నరు. ధనికులకు మోదీ సర్కార్​ రుణమాఫీ చేస్తే.. దాన్ని మాత్రం ప్రగతి కోసమని మీడియా చెప్తున్నది. కేవలం తన మిత్రులైన కొందరు ధనవంతుల కోసం మోదీ సర్కార్​ పనిచేస్తున్నది.. పేదలను పట్టించుకోవడం లేదు. 

ప్రస్తుతం కొందరు మోదీ సన్నిహితులైన ధనికుల వద్ద ఉన్న డబ్బు దేశంలోని 130 కోట్ల పేదల వద్ద ఉన్న డబ్బుతో సమానం” అని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ‘‘మోదీకి రైతుల గురించి పట్టదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ రైతులందరి రుణాలను మాఫీ చేస్తం. చరిత్రలో నిలిచిపోయే విధంగా దేశంలోని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తం” అని తెలిపారు. 

కుల గణనతో రాజకీయ ముఖచిత్రం మారుతది

దేశంలో 50 శాతం వెనుకబడిన కులాలు ఉన్నాయని రాహుల్​ అన్నారు.  15 శాతం దళితులు, 8 శాతం ఆదివాసీలు, 15 శాతం మైనార్టీలు, 5 నుంచి 6 శాతం అగ్రల కులాల్లో పేదలు ఉన్నారని చెప్పారు. వీరంతా కలిపితే 90 శాతం పైన ఉండగా.. కీలక రంగాల్లో వీరెవరికీ  చోటు లేదని తెలిపారు. ‘‘వెనుకబడిన వర్గాలు మీడియాలో కనిపించరు. దేశంలోని పెద్దపెద్ద కంపెనీల్లో ఉండరు. ఢిల్లీ సర్కారును నడిపించే ఐఏఎస్, ఐపీఎస్​లలో కేవలం ముగ్గురు బీసీలు, ముగ్గురు దళితులు, ఒక్క  ఆదివాసీ మించి లేరు.. అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. 

ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కేంద్రంలో మోదీ సర్కార్​ను గద్దె దించాలి’’ అని పేర్కొన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే దేశమంతా వెనుకబడిన తరగతుల కోసం కుల గణన చేస్తామని ప్రకటించారు. ‘‘తెలంగాణలో ఏదైతే చేశామో అది దేశమంతటా చేస్తం. దీని ద్వారా రాజకీయ ముఖచిత్రం మారుతుంది.  90 శాతం పేదలకు వాళ్ల హక్కులు అందుతాయి. ప్రతి వర్గాన్ని సర్వే చేయిస్తం. జాతి, కుల, ఆర్థిక గణన ద్వారా కొత్త రాజకీయ వ్యవస్థను సుస్థిరం చేయబోతున్నం” అని ఆయన పేర్కొన్నారు. 

నిరుద్యోగులకు ట్రైనింగ్​, రూ. లక్ష సాయం

యువకులను మోదీ నిరుద్యోగులుగా మార్చారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కోసం 'డైలీ రోజ్​గారీ పక్కా' పేరిట స్కీమ్​ను తీసుకొస్తం. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లందరికీ ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ ఇప్పిస్తం. ట్రైనింగ్​ నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష అందిస్తం. శిక్షణ తర్వాత ఉద్యోగం కల్పిస్తం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ స్కీమును అమలు చేస్తం. 

దేశంలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు హామీ ఇస్తున్న” అని ఆయన ప్రకటించారు. ప్రజల మధ్య విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతున్నదని, తాము ప్రజల మధ్య ప్రేమను పంచుతున్నామని చెప్పారు. ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణను, నాగర్​ కర్నూల్  ఎంపీగా మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాహుల్ కోరారు. ఆయా సభల్లో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  

పేదింటి మహిళకు ఏటా రూ.లక్ష

తెలంగాణ ప్రజలకు గ్యారంటీల పేరిట ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ నెరవేరుస్తున్నదని రాహుల్​ తెలిపారు. ఇప్పటికే రూ. 10లక్షల ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రూ. 500కే సిలిండర్​ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పేద మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఏడాదికి రూ. 30 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. 

ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈ గ్యారంటీ పథకాలను దేశమంతా అమలు చేస్తామని ప్రకటించారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. దేశంలో ప్రతి పేద కుటుంబం జాబితాను తయారు చేస్తం. ఆ కుటుంబంలో ఒక మహిళను ఎన్నుకుంటం. ఏటా ఆమె పేరిట బ్యాంక్ అకౌంట్లో రూ. లక్ష జమ చేస్తం. ఇట్లా ప్రతి నెలా రూ.8,500 చొప్పున ఏడాదికి రూ. లక్ష పేదింటి మహిళల అకౌంట్లలో టకాటక్​ డబ్బులు పడ్తయ్​. తెలంగాణ ప్రజలకు ఇక్కడి సర్కారు ఏటా ఇవ్వబోయే రూ.30 వేలతో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష కూడా తోడవుతుంది అని రాహుల్​గాంధీ వెల్లడించారు. 

ఉపాధి హామీ పథకంపై మంత్రి సీతక్క చెప్పిన విధంగా రోజు కూలీని రూ. 250 నుంచి 400 వరకు పెంచుతామని.. ఆశవర్కర్లు, అంగన్వాడీల ఆదాయం రెట్టింపు చేస్తామని.. వితంతువులకు 'చేయూత' స్కీమ్​ను డబుల్ చేస్తామని ప్రకటించారు. ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్​పై సర్వ హక్కులు ఇస్తామని ఆయన తెలిపారు.