తెలంగాణ రాష్ట్ర నిధుల నిర్వహణ ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నది. అభివృద్ధితో, సమతుల్య ప్రభుత్వ పరిపాలనతో ముడిపడి ఉన్న బడ్జెట్.. ప్రభుత్వం పనితీరుకు, ఆలోచన విధానానికి అద్దం పడుతుంది. 2014 నుంచి తెలంగాణ బడ్జెట్ తీరుతెన్నులు పరిశీలిస్తే చెప్పేదానికన్నా దాచిపెడుతున్నదే ఎక్కువ. ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ప్రతిఏటా బడ్జెట్ ప్రసంగాలు, శాసనసభలో చర్చలు ఉంటున్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం బడ్జెట్ వ్యవహారాన్ని ఒక ప్రహసనంగా మార్చింది. ఏటా ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్లో వస్తున్న ఆదాయంలో అదివరకే నిర్ధారణ అయిన ఖర్చుల శాతం దాదాపు 70 శాతానికి చేరింది. ఇందులో అనేకం గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల, నిర్ణయాల లేమి వల్ల, రకరకాలుగా పేరుకుపోయాయి. ఒకవిధంగా వీటిని ఫిక్స్డ్ చార్జెస్ అనవచ్చు. ఏటా అటు ఇటుగా నిర్ధారించే బడ్జెట్ కేవలం రూ.10 నుంచి 15 వేల కోట్లు ఉండవచ్చు. అదనపు అభివృద్ధికి నిధులు కావాలంటే అప్పులే శరణ్యం.
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు సంవత్సరానికి దాదాపు రూ.72 వేల కోట్లకు చేరింది. గతప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండానే ఈ పరిస్థితి ఉంటే ఒక వేల ఉద్యోగుల సంఖ్య పెంచి ఉంటే ఇది ఎంతకు చేరి ఉండేదో. 2014 నుంచి బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యమీద నిశిత పరిశీలన చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. ఒప్పంద ఉద్యోగుల సంఖ్య గురించి అయితే ఇంకా లోతైన సమస్య ఉన్నది. నెలకు దాదాపు ప్రభుత్వం చెల్లిస్తున్న జీతభత్యాలు రూ.6 వేల కోట్లు అంటున్నారు. ఒప్పంద ఉద్యోగులకు ఇందులో వాటా ఎంత అనేది స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది వరకు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో 5,000 మందికి పైగా నకిలీ ఉద్యోగులు దొరికారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలలో నమోదు చేసుకున్నారు. ఆధార్ కార్డు వివరాలను సేకరించిన తర్వాత స్కామ్ బయటపడింది. జీతాల పేరుతో నెలవారీగా కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తదుపరి చర్యల మీద కూడా ప్రభుత్వం ఏమీ చెప్పటం లేదు.
చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వీళ్ళందరికీ సుమారు రూ. 6,000 కోట్లు అవసరం. ఉద్యోగుల బకాయిలు ఇప్పటికే రూ. 9,000 కోట్లను అధిగమించాయి. ఇప్పుడు చేస్తున్న నెలవారీ చెల్లింపులు రూ.700 కోట్లు. పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా గత ప్రభుత్వం బెనిఫిట్ చెల్లింపులను ఎగవేసింది. వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. లబ్ధిదారులలో దాదాపు 5,000 మంది రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారట. ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని వర్గాలకు చెందిన 37,000 మందికి పైగా ఉద్యోగులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు మొత్తంగా దాదాపు 5.21 లక్షలు కాగా కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 4.93 లక్షలు ఉన్నారని సమాచారం.
గుది బండలు
2023లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తరువాత బడ్జెట్ విశ్లేషణలో నేను ఇదివరకే రాష్ట్ర బడ్జెట్ మీద పది గుదిబండలను ప్రస్తావించాను. గడిచిన 2 సంవత్సరాలలో ప్రభుత్వం వాటి గురించి, వాటి వలన రాష్ట్ర ఖజానా మీద ఏర్పడుతున్న భారం గురించి ఎక్కడ బహిరంగ స్పందన, చర్చ, మెరుగైన నిర్వహణకు అవసరమైన ఆలోచనలు చేసినట్టు కనిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏకసభ్య విచారణ కమిషన్ తప్పితే, ఇప్పటివరకు జరిగిన పెట్టుబడిని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు కనపడడం లేదు. కరెంటు సబ్సిడీ, హైదరాబాద్ రింగ్ రోడ్డు, కొత్తగా నిర్మాణం చేపట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు, మిషన్ భగీరథ, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, మెట్రో రైలు (పాత కొత్త మార్గాలు), మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు సహా వివిధ ‘అభివృద్ధి’ ప్రాజెక్టులు భారంగా మారాయి.
అప్పులతో అభివృద్ధి
అప్పులతో అభివృద్ధి చేస్తున్న వైనంలో వివిధ ప్రాజెక్టులు బడ్జెట్ పరిధిలోకి రావడం లేదు. ఇదివరకు ప్రభుత్వం చేసిన తప్పులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026–27 ( రూ.3.2–3.25 లక్షల కోట్లు) సంక్షేమం, నీటిపారుదల, విద్య, ఆరోగ్యం మీదనే దృష్టి పెడుతుంది. ఆర్ఆర్ఆర్, మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ఫ్రంట్, నీటిపారుదల ప్రాజెక్ట్ విస్తరణలు వంటి మెగా ప్రాజెక్టులు బడ్జెట్ వెలుపల ఉన్నాయి. దీనివల్ల గణనీయమైన నిధుల అంతరం ఏర్పడుతున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన దాదాపు 47 ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదని రాష్ట్రం ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ 47 ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తావన కూడా చేయకపోవచ్చు. ఇందులో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026–27లో లేని కేంద్ర బడ్జెట్ లేదా అప్పులు, ప్రైవేటు పెట్టుబడులపై ఆధారపడిన రోడ్లు, నీటిపారుదల, పట్టణ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.1.2–1.3 లక్షల కోట్లు. జీహెచ్ఎంసీ సొంతంగా రూ.11,460 కోట్ల రికార్డుస్థాయి ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదించినా H-CITI ప్రాజెక్టు ( రూ.5,942 కోట్లు) వంటి పెద్ద పరివర్తన ప్రాజెక్టులు ఆ బడ్జెట్లో లేవు. రాష్ట్ర బడ్జెట్ లో కూడా లేవు. ఆర్ఆర్ఆర్, మెట్రో ఫేజ్-II, మూసీ రివర్‌ఫ్రంట్, నీటిపారుదల ప్రాజెక్ట్ విస్తరణలతో కలిపి, హైదరాబాద్ నగర ప్రాజెక్టులు నిధుల అవసరాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో మాత్రం కానరావు.
ఆదాయం పరిమితులు
రాష్ట్ర బడ్జెట్ 2026–27 సుమారుగా 3.2 – 3.25 లక్షల కోట్లు (వార్షిక) ఉండవచ్చు. సగటు నెలవారీ ఖర్చు రూ.26,500–27,000 కోట్లు కాగా ఆదాయ వనరులలో పన్ను ఆదాయాలు (జీఎస్టీ, ఎక్సైజ్, ఆస్తి పన్ను, మోటారు వాహన పన్ను), పన్నుయేతర ఆదాయాలు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఉన్నాయి. ఇవి నెలకు దాదాపు రూ.12 వేల కోట్లు వస్తున్నాయని అంచనా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ పరిమితులు ఉన్నాయి. బడ్జెట్ ఖర్చు కంటే వచ్చే ఆదాయం సగమే. మిగతా నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? కొన్ని నిర్దిష్ట మార్గాలు: పన్నుల పెంచడం, మద్యం ఆదాయం పెంచుకోవడం, వినియోగం పెరిగితే పన్నుల రాబడి పెరుగుతుంది. ఆదాయం పెంచుకుంటున్న తీరు, ప్రభుత్వం ముందున్న అవకాశాల మీద శాసనసభలో చర్చ జరగకపోవడం కూడా గమనార్హం. అవినీతి నివారణ వల్ల కూడా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు. సగం కంటే ఎక్కువ స్థిర ఖర్చులు ఉండగా, అప్పుల గురించి ప్రస్తావనే లేకుండా, ఆదాయ పరిమితులు చర్చించకుండా రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2026-–27 పేలవంగా ఉండే అవకాశం ఉంది.
అప్పులు, వడ్డీలు
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రంమీద ఉన్న అప్పులను ప్రస్తావించారు. తదుపరి
ఆ అప్పులు కట్టటానికి అప్పులు చేయడం, వడ్డీలు కట్టటానికి అప్పులు చేయడం వంటి చర్యల వలన అప్పులు తగ్గకపోగా పెరిగినట్లు చూస్తున్నాం. బడ్జెట్లో ఈ అప్పులు ఇదివరకు ప్రస్తావించలేదు. ఈ ప్రభుత్వం కూడా గత రెండు బడ్జెట్లలో ప్రస్తావించలేదు. అప్పులు మీద ఒక ప్రత్యేక పద్దు ఆర్థికమంత్రి ప్రతి ఏటా ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సాగునీటి శాఖ పద్దు కింద ఒకే ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ.35,000 కోట్లకు పైగా ఋణం, వడ్డీ తిరిగి చెల్లించింది ప్రభుత్వం. ఇదే అతి పెద్ద చెల్లింపు. కాకపోతే ఇతర చెల్లింపులు కూడా ఉన్నాయి. అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకున్నారని, 10 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై తీవ్రభారం పడుతుందని, అసలు, వడ్డీ చెల్లించడానికి వెచ్చించే మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తక్కువ వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే కాల పరిమితి ఎక్కువగా అందించే సంస్థల నుంచి కొత్త రుణాలు తీసుకొని పాత రుణాలను తిరిగి చెల్లిస్తే ఖజానాపై భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా, రుణ మార్పిడి చేశాం. వడ్డీల భారం తగ్గించినామని ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. అధిక వడ్డీల భారం మోపడానికి కారణమయిన ప్రభుత్వాధినేతల చర్యల మీద సమీక్ష ఉండాలి. విచ్చలవిడిగా అప్పులు చేయకుండా
తగిన విధివిధానాల రూపకల్పన చేయాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
