కర్నాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. సీఎం అయిన 48 గంటల్లోనే డీకే శివకుమార్ కు షాక్ ఇచ్చారు మంత్రి లింగారెడ్డి. తనకు కేటాయించిన మంత్రి పదవిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఏకంగా తన పదవికి రాజీనామా చేయటం కలకలం రేపుతోంది. మంత్రి వర్గం కూర్పుపై వారం రోజులు సుదీర్ఘంగా.. ఢిల్లీ లెవల్లో చర్చలు జరిపి మరీ నిర్ణయించారు. ఈక్వేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యాయి అనుకున్న తర్వాత.. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత లింగారెడ్డి ఇలా అడ్డం తిరగటంతోపాటు రాజీనామా చేయటం కర్నాటక రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
కర్నాటక మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం (జూన్ 5)రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తితో రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సహోద్యోగి ద్వారా సీఎం డీకే శివకుమార్ ముఖ్య కార్యదర్శికి పంపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. కొత్త సీఎం డీకే శివకుమార్ మంత్రివర్గానికి శాఖలు ప్రకటించిన మరుసటి రోజే రామలింగారెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
డీకే శివకుమార్ సీఎం అయ్యాక జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రామలింగారెడ్డికి జలవనరుల శాఖ కేటాయించారు. అయితే మొదటి బెంగళూరు పట్టణాభివృద్ది శాఖను కోరుకుంటున్న రామలింగారెడ్డి ఆ శాఖ దక్కకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ శాఖను కృష్ణ బరే గౌడకు కేటాయించారు. రామలింగారెడ్డి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, సిద్దరామయ్య ప్రభుత్వంలో హోంమంత్రిగా , రవాణా, హిందూ మత దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
