అత్తాపూర్‌లో ఘోరం.. భార్యపై అనుమానంతో కత్తి, ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన భర్త!

అత్తాపూర్‌లో ఘోరం.. భార్యపై అనుమానంతో కత్తి, ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన భర్త!

హైదరాబాద్  అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తేజస్వి నగర్ కాలనీలో భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు.కత్తి, ఇనుప రాడుతో భార్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య కాలంలో దంపతుల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, ఇంట్లోని కత్తి, ఇనుప రాడుతో భార్యపై దాడి చేశాడు. భార్య అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి అక్కడ ఉన్న కీలక ఆధారాలను సేకరించింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లి మరణించడంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు.

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడైన భర్త కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ హత్యతో తేజస్వి నగర్ కాలనీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.