హైడ్రామా తర్వాత అన్నామలై రాజీనామా ఆమోదం : రాజ్యసభ సీటుకూ నో చెప్పిన నేత

హైడ్రామా తర్వాత అన్నామలై రాజీనామా ఆమోదం : రాజ్యసభ సీటుకూ నో చెప్పిన నేత

ఎట్టకేలకు నాలుగు రోజుల హైడ్రామా తర్వాత తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. అన్నామలై రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ అధికారికంగా ప్రకటించటంతో.. హైడ్రామాకు తెర పడింది. 

అన్నామలై రాజీనామాను ఆమోదించకుండా.. తమిళనాడు బీజేపీ పార్టీ పగ్గాలు అప్పగించే విధంగా అన్నామలైతో తీవ్రంగా చర్చలు జరిపింది బీజేపీ హైకమాండ్. తమిళనాడులో పోరాటానికి కావాల్సిన స్వేచ్ఛ ఇస్తామని.. ఇదే సమయంలో రాజ్యసభకు పంపిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అన్నామలైను రాజ్యసభకు పంపి.. తమిళనాడు పగ్గాలు అప్పగించాలనే పార్టీ ఆలోచనను సున్నితంగా తిరస్కరించారు అన్నామలై. నా దారి వేరే దారి.. బీజేపీతో కలిసి పని చేయలేను.. బీజేపీ పార్టీ కింద పోరాటం చేయలేను.. బీజేపీ ఆలోచనలు, సిద్ధాంతాలతో తమిళనాడులో రాజకీయం చేయలేను అని స్పష్టం చేస్తూ.. రాజీనామాకే మొగ్గు చూపారు అన్నామలై. 

జూన్ 2వ తేదీనే కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు ఇతర బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు అన్నామలై. రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించినా అన్నామలై నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు రాకపోవటంతో.. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ ప్రకటించారు. మొత్తంగా బీజేపీతో తన ఆరేళ్ల రాజకీయ ప్రయాణాన్ని ముగించారు అన్నామలై.

ALSO READ : దేశంలోనే ధనవంతులైన ముఖ్యమంత్రులు వీళ్లే

బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటంతో.. కొత్త రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్నారు అన్నామలై. ఇప్పటికే తమిళనాడులో అన్నామలై పార్టీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. పీపుల్స్ పవర్ డెమోక్రసీ అనే నినాదంతో అన్నామలై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ పార్టీ టీవీకేకు పోటీగా అన్నామలై కొత్త రాజకీయ పార్టీతో ముందుకు రాబోతున్నారనేది జోరుగా సాగుతున్న చర్చ.