- మ్యుటేషన్ కోసం సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులకు చక్కర్లు
- ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి..2 వేల వరకు దరఖాస్తుల పెండింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడంతో ఆస్తుల మ్యుటేషన్లు నిలిచిపోయాయి. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఇదివరకు ఉన్న వివరాలతో మ్యుటేషన్లు జరుగుతుండగా, కొత్త కార్పొరేషన్లలో మాత్రం సంబంధిత ఆస్తి ఏ బ్లాక్‌లోకి వస్తుంది? ఏ వార్డు, ఏ సర్కిల్ తో పాటు ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలు సబ్ రిజిస్ర్టార్ల వద్ద లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.
ఇప్పటికే 2 వేలకి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఏప్రిల్ నుంచి ఫీజులు కట్టిన వారు మ్యుటేషన్ పూర్తికాక బ్యాంకు లోన్లు తీసుకోలేకపోతున్నామని, వాటర్ కనెక్షన్, ఎలక్ర్టిసిటీ కనెక్షన్లకి సంబంధించి పేర్లను మార్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు ఐజీఆర్ఎస్ (ఇన్‌స్పెక్టర్-జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్)ని కోరారు. అయితే, ఐజీఆర్ఎస్ నుంచే సాఫ్ట్వేర్అప్డేట్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులంటున్నారు. మొత్తానికి రెండు శాఖల మధ్య సమన్వయ లోపమే సమస్యకు కారణమని తెలుస్తున్నది.
