- ఉమ్మడి జిల్లాలో వేగంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం..
- ఇప్పటికే 35 వేల ఎకరాల్లో తోటలు.. ఇంకా 10వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం
- ఈ సీజన్లో రికార్డు స్థాయిలో దిగుబడులు
- సాగును మరింత పెంచేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు
మహబూబ్నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వేగంగా పెరుగుతోంది. తక్కువ నీటి అవసరముండే పంటలను సాగు చేయాలని, ఈసారి ఎల్నినో ప్రభావం దృష్ట్యా తక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుండడంతో రైతుల చూపు ఆయిల్ పామ్ వైపు మళ్లింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 35 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు అవుతుండగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని మరో 10 వేల ఎకరాలకు విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సబ్సిడీపై మొక్కల అందజేతతో పాటు అధికారుల చొరవతో ఉమ్మడి జిల్లాలో ఈ తోటల సాగు విస్తీర్ణం త్వరలోనే 45 వేల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది.
ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం గద్వాల జిల్లాలో 8,100, నాగర్కర్నూల్ జిల్లాలో 7,900, నారాయణపేట జిల్లాలో 6,800, మహబూబ్నగర్ జిల్లాలో 5,300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ఇది ఇంకా పేంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా మరో 1,500 ఎకరాల్లో సాగును పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు 1,100 ఎకరాల సాగుకు పరిపాలన అనుమతులు కూడా తీసుకున్నారు. సబ్సిడీ ద్వారా రైతులకు మొక్కలను అందజేయడంతో పాటు ప్లాంటేషన్ పనులు పూర్తి చేయించారు. వర్షాలు పుంజుకోవడంతో వారం, పది రోజుల్లో లక్ష్యం మేరకు ఈ తోటలను పూర్తిగా సాగులోకి తీసుకురానున్నారు.
400 ఎకరాల నుంచి 7వేల ఎకరాలకు పైగా..
నారాయణపేట జిల్లాలోనూ ఆయిల్ పామ్ సాగు ఆశాజనకంగా ముందుకు సాగుతోంది. 2020లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ జిల్లాలో అప్పట్లో కేవలం 400 ఎకరాలలోపే పంట సాగు కాగా, క్రమంగా పెరుగుతూ గతేడాదికి ఏడు వేల ఎకరాలకు చేరింది. ఈ ఏడాది కూడా ఆయిల్ పామ్ సాగును మరింత పెంచాలని భావిస్తుండగా సాగు విస్తీర్ణం దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గెలల దిగుబడి రికార్డు స్థాయిలో..
మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఏడాది ఆయిల్ పామ్ గెలల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదైంది. గత మూడేండ్లతో పోలిస్తే దిగుబడులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూలై నాటికి 321 మంది రైతులకు చెందిన 1,463 ఎకరాలు కోతకు రాగా, ఏకంగా 2,375 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చి రైతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎకరాకు సగటున 1.62 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, మార్కెట్లోనూ గెలలకు మంచి డిమాండ్ లభిస్తోంది. గతేడాది టన్ను ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ (ఎఫ్ఎఫ్బీ) ధర రూ.17 వేల నుంచి రూ.19 వేల మధ్య ఉండగా, ఈ ఏడాది డిమాండ్ నేపథ్యంలో అది రూ.23 వేల నుంచి రూ.23,500 వరకు పలుకుతుండటంతో రైతులకు లాభాల పంట పండుతోంది.
ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు
ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో వారిని చూసి మిగతా రైతులు కూడా ఆయిల్పామ్సాగు చేయడానికి పోటీ పడుతున్నారు.
సబ్సిడీ మొక్కల పంపిణీ నుంచి డ్రిప్ మంజూరు వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దళారుల ప్రమేయం లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే ఆయిల్ పామ్ గెలలకు సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
వేణుగోపాల్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, మహబూబ్నగర్
