టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. వరుస ఫ్లాప్స్‌తో డైరెక్టర్లుగా మారుతున్న హీరోలు!

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. వరుస ఫ్లాప్స్‌తో డైరెక్టర్లుగా మారుతున్న హీరోలు!

టాలీవుడ్ యువ హీరోలు వరుస అపజయాలతో తీవ్ర నిరాశలో ఉన్నారు.  అంతా ఒకే అంటూ భారీ అంచనాలతో వారి సినిమాలు థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద బొల్తా పడుతున్నాయి. తొలి రోజు కాస్త పర్వాలేదు అనిపించినా... రెండు రోజు నుంచే చిత్ర బృందాన్ని డీలాలో పడేస్తున్నాయి. దీంతో  మేకర్స్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. దీంతో యంగ్ హీరోస్  ఇప్పుడు రూటు మార్చేస్తున్నారు.

మెగాఫోన్ పట్టేస్తున్న యంగ్ హీరోస్..

ఒకప్పుడు దర్శకుల కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరోలు.. ఇప్పుడు తామే మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. కథపై పూర్తి నియంత్రణ, తమ ఇమేజ్‌కు తగ్గ ప్రెజెంటేషన్, క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం హీరోలు దర్శకులుగా మారుతున్నారు. లేటెస్ట్ గా సుధీర్ బాబు, కార్తికేయ, రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం తమ తదుపరి చిత్రాలతో దర్శకులుగా అరంగేట్రం చేయనున్నారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే విశ్వక్ సేన్ తన కల్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ పోతినేని తన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'RAPO 23'ను స్వయంగా డైరెక్ట్ చేయనున్నట్లు ప్రకటించాడు. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా తన తొలి దర్శకత్వ చిత్రంపై పనులు ప్రారంభించాడు. వరుసగా హీరోలు ఈ దారిని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస ఫ్లాప్స్, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం, తమ టాలెంట్ ను నిరూపించుకునే  బలమైన ఆలోచన ఈ యంగ్ హీరోల్లో ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

నటులుగా..దర్శకులుగా.. 

అటు సినీచరిత్రను చూస్తే రాజ్ కపూర్, ఎన్.టి.రామారావు వంటి దిగ్గజాలు నటులుగానే కాక దర్శకులుగానూ చిరస్థాయిగా నిలిచారు. అయితే కృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు మాత్రం దర్శకత్వంలో అదే స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల ధనుష్ కూడా 'రాయన్ ' దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు.

దర్శకత్వం అంటే అంత ఈజీ కాదు..

మంచి దర్శకుడి కోసం ఎదురుచూడటం కంటే.. మన కథను మనమే చెప్పడం మంచిదని చాలామంది హీరోలు భావిస్తున్నారు. అయితే నిర్మాత సి. కళ్యాణ్ మాత్రం దర్శకత్వం అంటే అంత ఈజీ కాదు నటన కంటే చాలా క్లిష్టమైన బాధ్యత అని చెబుతున్నారు. ఒక సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రతి రూపాయి విలువ దర్శకుడిగా మారిన తర్వాతే పూర్తిగా అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.హీరో దర్శకుడైతే నిర్మాత పడే ఒత్తిడి తెలుస్తుంది. అప్పుడు సినిమాను మరింత బాధ్యతతో తెరకెక్కించే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు.

►ALSO READ | Venkatesh: 'నేనే మ్యాన్ ఆఫ్ ది హౌస్'... ‘ఆదర్శ కుటుంబం’ నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్!

పూర్తి బాధ్యత తీసుకుంటే మంచిదే..

దర్శకుడు హేమంత్ మధుకర్ మాత్రం ఈ కొత్త ట్రెండ్‌ను స్వాగతిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు షూటింగ్ సెట్లలో పనిచేసిన నటులకు సినిమా నిర్మాణంలోని అన్ని విభాగాలపై మంచి అవగాహన ఉంటుందని, వారికి చెప్పాలనుకునే కథ ఉంటే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాదు.. తెరవెనుక దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం కంటే, పూర్తి బాధ్యత తీసుకుని స్వయంగా దర్శకత్వం వహించడం ఇండస్ట్రీకి ఆరోగ్యకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు.

స్టార్‌డమ్‌తో కాదు..

అయితే హీరో-దర్శకుడిగా మారడం వల్ల మరో సవాలు కూడా ఉంటుందని హేమంత్ మధుకర్ హెచ్చరిస్తున్నారు. ఒకసారి దర్శకుడిగా మారితే భవిష్యత్తులో ఇతర దర్శకులు ఆ హీరోతో పనిచేయడానికి వెనుకాడే అవకాశం ఉందని, క్రియేటివ్ జోక్యం ఉంటుందేమోనన్న సందేహం వారికి కలగొచ్చని చెప్పారు.  ఒక దర్శకుడి గుర్తింపు అతని స్టార్‌డమ్‌తో కాదు, అతను తెరకెక్కించిన సినిమాతోనే నిర్ణయించబడుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.