నేను స్ట్రీట్ ఫైటర్‌ను.. ఏసీ రూమ్ కార్యకర్తను కాదు..ధర్మెంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు

నేను స్ట్రీట్ ఫైటర్‌ను.. ఏసీ రూమ్ కార్యకర్తను కాదు..ధర్మెంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, ధర్మెంద్ర ప్రధాన్  ఇవాళ తొలిసారిగా పార్లమెంట్‌కు వచ్చారు. మకర్ ద్వార్ వద్ద బీజేపీ ఎంపీలు ఆయనకు ఘనస్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు లేకుండానే రాజకీయ బాధ్యత వహిస్తూ ఆయన తప్పుకోవడం పట్ల పార్టీ శ్రేణులు మద్దతుగా నిలిచాయి.

ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆయనను పలకరించి సానుభూతి తెలిపారు. దీనికి స్పందిస్తూ ధర్మెంద్ర ప్రధాన్... ఏం జరగలేదు, నేను ఒక స్ట్రీట్ ఫైటర్‌ను.. అంతేగానీ ఏసీ రూమ్ యాక్టివిస్ట్ కాదు అంటూ చాలా ఘాటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా తాను రాజకీయంగా ఎప్పటికీ వెనక్కి తగ్గేది లేదని ఆయన ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.

►ALSO READ | ఆసుపత్రి నుంచి వాంగ్‎చుక్ డిశ్చార్జ్.. ఇంటికి వెళ్లకుండా నేరుగా ఎక్కడికి వెళ్లారంటే..? 

నీట్, ఇతర పరీక్షల వివాదాల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇదొక ముగింపు కాదని స్పష్టమవుతోంది. ఒడిశాలో బలమైన నేతగా ఉన్న ప్రధాన్, గతంలో బీహార్, హర్యానా, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ మరింత పెద్ద బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.