న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు ఆయనను సోమవారం (జులై 27) డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వాంగ్ చుక్ నేరుగా లడఖ్‌కు వెళ్లకుండా మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ ధర్నాకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
23 రోజుల పాటు దీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించారు. క్రమంలో సీజేపీ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో 26 రోజుల తర్వాత వాంగ్ చుక్ తన దీక్ష విరమించారు.
