దేశంలో ప్రతి మధ్యతరగతి కుటుంబానికి LIC అంటే ఒక నమ్మకం. తమ కష్టార్జితాన్ని, భవిష్యత్తు అవసరాల కోసం పాలసీల రూపంలో ఎల్‌ఐసీలో దాచుకుంటారు. దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన ఈ ప్రభుత్వ రంగ సంస్థ.. ఓ వివాదాస్పద కంపెనీలో పెట్టిన పెట్టుబడులు, అక్కడ జరిగిన భారీ నష్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. అసలు ఎల్ఐసీ ఈ ఉచ్చులో ఎలా చిక్కుకుంది.. దాని వల్ల ఎంత నష్టం వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 15 లక్షల కోట్ల కుంభకోణం..
బంగారం, జ్యువెలరీ ఎగుమతులు చేసే బెంగళూరుకు చెందిన ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’ కంపెనీ ప్రస్తుతం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ SEBI రాడార్‌లోకి వచ్చింది. 2021 ఆర్థిక సంవత్సరం నుండి 2025 వరకు 5 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ ఏకంగా రూ.15లక్షల 15వేల కోట్ల మేర లేని ఆదాయాన్ని అదనంగా చూపించిందని.. కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. 1995లోనే లిస్ట్ అయిన ఈ కంపెనీ గుట్టు తెలిసిన దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు గత 10 ఏళ్లుగా ఈ కంపెనీలో పెట్టుబడులకు ఆమడదూరంలో ఉంటున్నాయి.
ఇతరులు పారిపోతుంటే.. ఎల్‌ఐసీ ఎందుకు ఎగబడింది?
ప్రైవేట్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీ ఆర్థిక సమాచారంపై నమ్మకం లేక పెట్టుబడులు ఉపసంహరించుకుంటే.. ఎల్‌ఐసీ మాత్రం రివర్స్ గేర్ వేసింది. 2016 మార్చిలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్‌ఐసీ వాటా కేవలం 1.99 శాతంగా ఉంటే.. అది 2022 మార్చి నాటికి ఏకంగా 5 రెట్లు పెరిగి 11.22 శాతానికి చేరింది. మార్చి 31, 2026 నాటికి కూడా ఎల్‌ఐసీ ఇందులో 10.80% భారీ వాటాను కొనసాగిస్తూ వస్తోంది. మార్కెట్ నిపుణులు ఈ కంపెనీ వైపు చూడటానికే భయపడుతుంటే.. ఎల్‌ఐసీ మాత్రం ఏ ధైర్యంతో గోల్డ్ కంపెనీకి అండగా నిలిచిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ.
ఎంత నష్టం వచ్చింది?
ఎల్‌ఐసీ మొండిగా పెట్టుబడులు కొనసాగించిన కాలంలోనే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు కుప్పకూలాయి. ఫిబ్రవరి 2023లో గరిష్ట స్థాయిల్లో ఉన్న ఈ షేరు విలువ.. గడిచిన ఏడాది కాలంలోనే 49 శాతం పడిపోయింది. పీక్ స్టేజ్ నుండి చూస్తే ఏకంగా 90 శాతం మేర క్రాష్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ షేరు ధర రూ. 104 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3వేల 068 కోట్లకు పడిపోవడంతో.. ఎల్‌ఐసీ చేతిలో ఉన్న 10.80% వాటా విలువ కేవలం రూ.340 కోట్లకు పరిమితమైంది. అంటే కాలగర్భంలో కలిసిపోయిన ప్రజాధనం ఎంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ దుమారం: ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి?
కోట్లాది మంది ప్రజల ఇన్సూరెన్స్ సొమ్ము ఇలా బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అసలు మిగిలిన ఇన్వెస్టర్లందరూ పారిపోతుంటే.. ఎల్‌ఐసీ మాత్రమే ఎందుకు అంత భారీ వాటాను కొనుగోలు చేసింది? ఈ పెట్టుబడుల వెనుక అధికార పీఠంలో ఉన్న పెద్దల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. దేశ ప్రజల నమ్మకానికి ప్రతీక అయిన ఎల్‌ఐసీ.. ఇలాంటి వివాదాస్పద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
