పర్యావరణ పరిరక్షణ వేరే ఎవరిదో బాధ్యత అనే భ్రమలో మనం జీవిస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. దాని ఫలితమే పెరిగిన ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, వరదలు. కలుషితమవుతున్న నేల, నీరు, గాలి వల్ల మానవాళి మనుగడకు తీవ్ర ఆటంకాలను కలిగిస్తోంది. ప్రపంచ మానవాళి మనుగడ, శ్రేయస్సు పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం జరపాలని 1972లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీర్మానించింది. 1973 జూన్ 5న ‘భూమి ఒక్కటే’ అనే ముఖ్య ఉద్దేశంతో మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రారంభమైనది. ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ మన భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణ చేపట్టాలనే సరికొత్త ఉద్దేశంతో... 2026 జూన్ 5వ తేదీన సభ్య దేశాలలో విస్తృత కార్యక్రమాల ద్వారా ప్రజలలో పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి
సభ్య దేశాలను కోరింది.
100 సంవత్సరాలు పైన దాటిన చెట్టు విలువ కోటి రూపాయల విలువ కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అందుకే ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మతాయ్ మన జీవితంలో చేసే గొప్పపని మొక్కలు నాటడమే అని భావించడం వలన లక్షల మొక్కలు నాటి, సంరక్షించగలిగాను అని చెప్పారు. దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల మంది ప్రజలు తక్షణం ప్రతి ఒక్కరు పది చెట్లకు పైగా నాటడం, వాటి సంరక్షించడం యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే భవిష్యత్ మరింత అంధకారంలోకి వెళ్తుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దీనికితోడుగా ప్రస్తుత యుద్ధాలవల్ల కలిగే వాయు కాలుష్యం, క్షిపణులు, బాంబు దాడుల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే రసాయనాలు మేఘాల ఏర్పాటును అడ్డుకొని ఎల్-నినో విపత్తును మేల్కొల్పుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలలో ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్ కారణంగా భూమిలోకి నీరు ఇంకకుండా ఉండడం వలన భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం, పట్టణ ఉష్ణోగ్రతలు పెరగడం మనం నిత్యం గమనిస్తున్నాం.
మన వ్యవసాయ ఉత్పత్తులు 60శాతం పెరగాలి
పారిశ్రామిక, రసాయన కాలుష్యం వలన నేల కాలుష్యపూరితంగా మారి జీవవైవిధ్యం లోపిస్తోంది. గాలి నాణ్యత పడిపోవడం, పచ్చని ప్రదేశాల కొరత కారణంగా పట్టణ జీవనం అస్తవ్యస్తమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 33% నేలలు సారవంతాన్ని కోల్పోయి క్షీణించాయి. కేవలం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మట్టిని సహజసిద్ధంగా ఉత్పత్తి చేయడానికి వెయ్యి సంవత్సరాలు పట్టవచ్చు. నేలలు సారవంతతను కోల్పోవడం వలన గత 70 సంవత్సరాలలో మన పండిస్తున్న వివిధ ఆహార పంటలలో పోషకాలు, విటమిన్లు లభ్యత తగ్గిపోవడం వలన ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాలు కూడా పెరుగుతున్నాయి. అంతేకాకుండా 2050 సంవత్సరం నాటికి ప్రపంచ ఆహార డిమాండ్‌ను తీర్చడానికి మన వ్యవసాయ ఉత్పత్తులు సుమారు 60 శాతం పెరగాలి. భవిష్యత్తులో స్థిరమైన నేల నిర్వహణ ద్వారా 58% వరకు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మాత్రమే ఆహార భద్రత కోసం పాటుపడవచ్చు. కావున నేలల సంరక్షణ, పర్యవేక్షణ తక్షణ అవసరం. నేల పరిరక్షణ, సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు వాడకాన్ని పెంచాలి. అదేవిధంగా నీటి కాలుష్యాన్ని అరికట్టడం, చెట్లను పెంచడం, పంట మార్పిడి చేయడం, పప్పు ధాన్యాల సాగు, చిరుధాన్యాల సాగుతోపాటు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
నీటి కొరతతో జీవకోటికి ఇబ్బందులు
మానవ కారక కాలుష్యాన్ని నియంత్రించడం, చెత్తాచెదారాలను సరైన పద్ధతిలో నిర్వహించడం, గడ్డి మందులు వంటి మొదలైన క్రిమిసంహారక మందుల వాడకంలో నియంత్రణ పాటించాలి. పంటకు తగినంత ఎరువులను మాత్రమే వాడడం చేపట్టినట్లయితే నేల ఆరోగ్యం, పశుసంపద ఆరోగ్యం, మానవాళికి ఆరోగ్యంతోపాటు సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత సాధ్యపడుతుంది. ఒకప్పుడు పుష్కలంగా దొరికే నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం, అవసరానికి మించి వాడుతూ వృథా చేస్తున్నాం. హిమాని నదులు మనకు కావలసిన తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక రంగాల నీటి అవసరానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన పర్యావరణం పెంపొందించడానికి వెలకట్టలేని అత్యంత ఆవశ్యకమైన నీటిని మనకు అందిస్తున్నాయి. వాతావరణ మార్పులు, మానవ చర్యల వల్ల వేగంగా కరుగుతున్న హిమాని నదుల వలన భవిష్యత్తులో నీటి కొరత ఉండే అవకాశం లేకపోలేదు. తద్వారా ఈ భూమండలంపైన నివసిస్తున్న జీవకోటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
నీరు ప్రకృతికి చోదకశక్తి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు హిమాని నదుల మంచు పర్వతాలు కరగడం ద్వారా లభ్యమయ్యే నీటిపై ఆధారపడుతున్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ శక్తి కోసం హిమాని నదులపైనే ఆధారపడి ఉన్నారు. జలమే జీవం కాబట్టి ఎంతో అమూల్యమైనటువంటి నీటిని ఒడిసిపట్టి, సమస్త
జీవకోటికి తగినంత నీరు అందేలా చేయడంతోపాటు ప్రపంచ ఆహార భద్రత, ప్రపంచశాంతికి ప్రపంచ దేశాలు కృషి చేయాలి. నీరు ప్రజలకు, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ప్రకృతికి ఒక చోదక శక్తి లాంటిది. ఆహార గొలుసుకు పునాది. ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. భవిష్యత్తులో పుష్కలంగా మంచినీరు దొరుకుతుందని, ఎన్నటికీ నీరు తరగదు అనే అపోహలో ఉండకూడదు. మంచినీటి సంరక్షణ, వర్షపునీటిని ఒడిసి పట్టుకోవడం, నీటి యజమాన్య పద్ధతులను పాటించడం, పంట మార్పిడి, తక్కువ నీటితో సాగు, సూక్ష్మ సేద్యం మొదలైన చర్యలను చేపడుతూ నీటి కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలకు ఆహార భద్రతను కల్పించాలి.
గాలి కాలుష్యాన్ని నియంత్రించాలి
పెరిగిన వాహనాల సంఖ్య, విడుదల చేసే ఉద్గారాలు, వేసవిలో అధిక మోతాదులో ఏసీలు వాడకం, పారిశ్రామిక ఉద్గారాలు, రోడ్డు దుమ్ము, నగరాలలో బిల్డింగుల నిర్మాణం ద్వారా ఏర్పడే దుమ్ము, దూళి, గ్రామీణ ప్రాంతాలలో పంట వ్యర్థాలు తగలబెట్టడం ద్వారా అధిక మోతాదులో గాలి కాలుష్యం జరుగుతున్నది. దీన్ని నియంత్రించాలి. గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) రీడింగ్‌లు సాధారణంగా 35 నుంచి 50 మధ్య ఉంటాయి. అధిక వాహన రద్దీ, పారిశ్రామిక కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలలో గాలి నాణ్యత అత్యంత అధ్వానంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి ప్రకారం ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాలు 40 మైక్రోగ్రాములు (ఎంజీ) వరకూ ఉండొచ్చు. హైదరాబాద్‌లో దీనికి రెట్టింపుస్థాయిలో 82–-88 ఎంజీల వరకూ నమోదవుతోంది. కర్మాగారాలు, తయారీ యూనిట్ల ద్వారా ముఖ్యంగా నగర శివార్లలో సూక్ష్మ కణ పదార్థాలు, హానికరమైన వాయువులను గాలిలోకి విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి వ్యక్తి చెట్లు నాటడం, పెంచడంపై దృష్టి పెట్టాల్సిన సమయం మాత్రం వచ్చిందని చెప్పాలి.
చెట్లు మనకు కావలసిన ప్రాణవాయువును అందించడంతోపాటు కాలుష్యాన్ని, అధిక ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. భూమిని చల్లపరచడంతోపాటు సకాలంలో వర్షాలు కురవడానికి ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాకుండా నేల సారవంతాన్ని సంరక్షిస్తూ మట్టి కోతను నివారిస్తాయి. పర్యావరణపరంగా ఒక్క మనిషికి సుమారు 100 చెట్లు ఉండాలి. కానీ, మన దేశంలో ప్రతి వ్యక్తికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. వివిధ దేశాల వారీగా చూసినప్పుడు... ఆస్ట్రేలియా 3,266, యునైటెడ్ స్టేట్స్ 699, ఫ్రాన్స్ 203, ఇథియోపియా 143, చైనా 130, యూకే 47, గ్రీన్లాండ్ 4,964, కెనడా 10,163 చెట్లు ఆ దేశ పౌరుడికి సగటుగా ఉన్నాయి. భారత సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ నిపుణుల కమిటీ ఒక చెట్టు సంవత్సరానికి సుమారు 74,500 రూపాయల ఆదాయాన్ని అందిస్తుందని నిర్ధారించింది. సంవత్సరానికి సుమారు 45,000 రూపాయల విలువైన వైద్య ప్రమాణాలతో కూడిన ఆక్సిజన్ ఉత్పత్తి, సుమారు 20,000 రూపాయల విలువైన జీవ ఎరువులు, సుమారు 9,500 రూపాయల విలువైన సూక్ష్మపోషకాలు మరియు కంపోస్ట్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేశారు.
- డాక్టర్. ఎ. పోశాద్రి
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రొ. జయశంకర్ తెలంగాణ
అగ్రికల్చర్ యూనివర్సిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
