దేశీయ కార్ల మార్కెట్‌లో అత్యంత నమ్మకమైన బ్రాండ్లలో ఒకటైన మారుతి సుజుకి మరోసారి కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులను ఆకట్టుకున్న బ్రెజ్జా ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. డిజైన్ మార్పులు, ఆధునిక ఫీచర్లు, కొత్త ఇంజిన్ ఆప్షన్లతో జూలై 24న విడుదల కానున్న కొత్త బ్రెజ్జా.. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2016లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మారుతి బ్రెజ్జా కాంపాక్ట్ SUV విభాగంలో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, మారుతి SUV విక్రయాల్లో కీలక మోడల్‌గా నిలిచింది. ప్రస్తుతం రెండో తరం బ్రెజ్జా 2022లో విడుదల కాగా, ఇటీవల కాలంలో ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఎంపికల్లో ప్రత్యర్థి కార్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో మళ్లీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.
కొత్త బ్రెజ్జా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల ద్వారా రూ.11వేలు టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుందని అంచనా. ఈ ఇంజిన్ 103 PS పవర్, 139 Nm టార్క్‌ను అందిస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు, CNG వెర్షన్ కూడా కొనసాగనున్నాయి. కొత్తగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మారుతి ఫ్రాంక్స్‌లో ఉన్న ఇంజిన్ మాదిరిగా 100 PS పవర్, 148 Nm టార్క్‌ను అందించవచ్చు.
ఫీచర్ల విషయంలో కొత్త బ్రెజ్జాలో పెద్ద మార్పులు ఉండే అవకాశం ఉంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రావచ్చని అంచనా. బయట డిజైన్‌లో స్వల్ప మార్పులు మాత్రమే ఉన్నా, క్యాబిన్‌లో మాత్రం భారీ అప్‌డేట్స్‌తో ప్రత్యర్థి కార్లకు పోటీగా నిలిచేలా మారుతి సుజుకి బ్రెజ్జాను సిద్ధం చేస్తోంది.
