- అంజనాపురంలో దేశంలోనే ఫస్ట్ ఆయిల్ పామ్ హబ్
- వ్యవసాయానికి పరిశ్రమలు తోడైతే రైతుల సుస్థిర అభివృద్ధి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కొణిజర్ల, వెలుగు: వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ రూ.300 కోట్లతో నిర్మించిన దేశంలోని తొలి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌ను సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుల ఆదాయం పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వ్యవసాయానికి పరిశ్రమలు తోడైతేనే రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని చెప్పారు. అధిక ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు నాలుగేళ్లలో ఎకరాకు రూ.52 వేల వరకు ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.
దిగుమతులకు చెక్..
దేశంలో ఏటా సుమారు 22 మిలియన్ టన్నుల వంటనూనె అవసరం ఉండగా, దేశీయ ఉత్పత్తి 12 మిలియన్ టన్నులకే పరిమితమైందన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా ఆయిల్ పామ్ సాగు విస్తరణ ద్వారానే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. కొణిజర్లను రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక మండలంగా అభివృద్ధి చేస్తామని, ఖమ్మం జిల్లాలో మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
దేశీయంగానే అందుబాటులో నాణ్యమైన విత్తనాలు: తుమ్మల
తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో ఉన్న ఆయిల్ పామ్ సాగును మరో రెండు నుంచి మూడు సంవత్సరాల్లో 10 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రతి 10 వేల ఎకరాలకు ఒక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అంజనాపురంలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటైనందున మలేషియా, ఇండోనేషియా నుంచి విత్తనాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండబోదన్నారు. దేశీయంగానే నాణ్యమైన విత్తనాలు, మొక్కలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మరో ఆరు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ బి.గోద్రెజ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ సునీల్ కటారియా, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్, ఖమ్మం కలెక్టర్ దివాకర్ టీఎస్, సీపీ సునీల్ దత్, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.
