భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తొలి డెంగ్యూ వ్యాక్సిన్..4 నుంచి 60 ఏండ్ల వయసు వారు తీసుకోవచ్చు

భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తొలి డెంగ్యూ వ్యాక్సిన్..4 నుంచి 60 ఏండ్ల వయసు వారు తీసుకోవచ్చు
  • ‘క్యూడెంగా’కు ఆమోదం తెలిపిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా
  • టీకాను అభివృద్ధి చేసిన జపాన్​కు చెందిన టకేడా బయో ఫార్మాస్యూటికల్స్
  • 4 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు వారు తీసుకునేందుకు అనుమతి 

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌లో రోజురోజుకూ పెరుగుతున్న డెంగ్యూ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జపాన్‌‌‌‌కు చెందిన టకేడా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చింది. మన దేశంలో ఆమోదం పొందిన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ప్రపంచంలో నమోదయ్యే మొత్తం డెంగ్యూ కేసుల్లో దాదాపు మూడో వంతు కేసులతో భారత్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. వర్షాకాలం, ఆ తర్వాత వచ్చే రోజుల్లో ఆస్పత్రులపై పడే ఒత్తిడిని తగ్గించడంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించనుంది.

డెంగ్యూలో ఉన్న నాలుగు రకాల వైరస్ సీరోటైప్‌‌‌‌ల (డీఈఎన్ వీ1, -2, -3, -4) పై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. 4 నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న వారు ఈ టీకాను తీసుకోవచ్చు. గతంలో అందుబాటులోకి వచ్చిన డెంగ్వాక్సియా వ్యాక్సిన్ తీసుకోవాలంటే అంతకుముందు డెంగ్యూ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి రక్తం పరీక్షలు చేయాల్సి వచ్చేది. కానీ, క్యూడెంగా వ్యాక్సిన్‌‌‌‌కు ఎలాంటి రక్తపరీక్షలు అవసరం లేదు. గతంలో డెంగ్యూ వచ్చినా, రాకపోయినా ఈ టీకా తీసుకోవచ్చు. ఈ టీకాను చర్మం కింద ఇస్తారు. 3 నెలల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, యూకే, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేసియా వంటి 40కి పైగా దేశాల్లో దీనికి అనుమతి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కూడా ఈ టీకాను సిఫార్సు చేసింది. 20 వేల మందికి పైగా చిన్నారులపై నిర్వహించిన మూడో దశ ప్రయోగాల ఫలితాల ప్రకారం.. 84% వరకు డెంగ్యూ వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా కాపాడుతుంది. 61% వరకు సాధారణ డెంగ్యూ లక్షణాలు రాకుండా నిరోధిస్తుంది. తీవ్రమైన డెంగ్యూ బారిన పడకుండా సుదీర్ఘ రక్షణ కల్పిస్తుంది.