- సర్కార్ బడిలో చదివి సైంటిస్ట్‌గా ఎదిగిన నరేందర్
ఖమ్మం, వెలుగు: 'స్కైరూట్ ఏరోస్పేస్' విజయగాథలో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇస్రో సహాయం లేకుండా తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి రాకెట్‌ను పంపిన తొలి భారత ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ చరిత్ర సృష్టించింది.
విక్రమ్ రాకెట్ ప్రయోగంలో నరేందర్ రెడ్డి కీలక టీం లీడర్‌గా సేవలందించారు. స్కైరూట్ ఏరోస్పేస్‌లో లిక్విడ్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ టీమ్ లీడ్‌గా పనిచేస్తున్న నరేందర్ రెడ్డి, ఈ నెల 18న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్ రాకెట్ మిషన్‌లో ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థల సమీకరణ, పరీక్షలు, ప్రయోగానికి ముందస్తు సాంకేతిక ప్రక్రియల్లో ఆయన నాయకత్వం వహించారు.
పల్లెటూరు నుంచి అంతరిక్ష రంగానికి..
రైతు కుటుంబానికి చెందిన మోర్తాల హనుమిరెడ్డి, లక్ష్మి దంపతుల కొడుకు నరేందర్ రెడ్డి ప్రాథమిక విద్యను మాదాపురం జడ్పీ స్కూల్లో అభ్యసించారు. అనంతరం ఖమ్మంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్‌లో హైస్కూల్ విద్య, నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంక్ సాధించిన ఆయన, డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న మామ మల్లు వెంకటరెడ్డి స్ఫూర్తితో జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం రెండేళ్లపాటు డీఆర్డీవోలో పనిచేసి సాంకేతిక అనుభవం సంపాదించారు.
చిన్నప్పటి నుంచే సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి పెరగడానికి తన మామే కారణమని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. డీఆర్డీవోలో పొందిన అనుభవంతో స్కైరూట్ ఏరోస్పేస్‌లో చేరిన ఆయన, ప్రస్తుతం ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ టీమ్ లీడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విక్రమ్ రాకెట్ విజయవంతంలో తన వంతు పాత్ర పోషించడం గర్వంగా ఉందని చెప్పారు. మాదాపురం గ్రామ ప్రజల ప్రేమ, ప్రోత్సాహం, ఆశీర్వాదాలే తన విజయానికి బలమని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
