- క్యూర్ పరిధిలో తొలివిడత 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇండ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- నేటి నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
- ఇండ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్
- ఒక్కో ఇంటికి రూ.11 లక్షలు, రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ
- రూ.40 లక్షల-- – -60 లక్షల విలువ చేసే స్థలం లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్
- సెక్రటేరియెట్‌లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం,
- అజారుద్దీన్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి క్యూర్ (కోర్అర్బన్ రీజియన్) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయించి, బోనాలు తీయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలి విడత 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున మొత్తం 8 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో కూడా ఈ పథకం అమలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్భంలో క్యూర్ పరిధిలో పేదల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, పేదల సంక్షేమం విషయంలో రాజీ పడబోమని, ఇళ్ల విషయంలో త్వరలో మధ్యతరగతి ప్రజలకు సైతం శుభవార్త అందిస్తామన్నారు. సోమవారం సెక్రటేరియెట్‌లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. బ్రోచర్, మీసేవ, వాట్సాప్ దరఖాస్తులను ఆయన ఆవిష్కరించారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేరు పెట్టిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందిన కొండా నాగరాజుకు రూ.లక్ష నగదు బహుమతిని మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పడు క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లతో కలిపి 8 లక్షలకు చేరిందని తెలిపారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయంతో హైదరాబాద్‌కు 30 నుంచి -35 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు నిర్మించారని, దీంతో 8-9 వేల మంది మాత్రమే ఉంటున్నారని చెప్పారు. మిగిలిన వారు మంజూరు పత్రాలు తీసుకున్నారే తప్ప ఆ ఇండ్లలో ఉండడం లేదన్నారు. పేదల ఉపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ప్రకటించారు.
రూ.60 లక్షల జాగ ఫ్రీగా రిజిస్ట్రేషన్
పేదల నివాస ప్రాంతాల్లోనే 525 ఎస్ఎఫ్‌టీలో రూ.40 నుంచి రూ.-60 లక్షల విలువైన స్థలాన్ని ఆడపడుచుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని పొంగులేటి తెలిపారు. దీనిని పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం ఉండదని, బ్యాంకులో రుణం కోసం కుదువ పెట్టుకోవచ్చని చెప్పారు. ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఇల్లు మంజూరు కాకపోతే కట్టిన రూ.10 వేలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తుందని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతుందని, లబ్ధిదారుల నుంచి రూ.6 లక్షలు నాలుగు వాయిదాల్లో తీసుకుంటామని, ఆ మొత్తంలో దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.10 వేలు మినహాయిస్తామని తెలిపారు.
పేదలకు ఇండ్లు ఇచ్చేందుకే: మంత్రి శ్రీధర్ బాబు
గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎల్ఐజీ హౌసింగ్ టవర్లను నిర్మించామని, ఇదే స్ఫూర్తితో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. క్యూర్ పరిధిలో ప్రారంభించిన ఎల్ఐజీ హౌసింగ్ టవర్స్ నగర అభివృద్ధిలో చరిత్రాత్మకంగా నిలుస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో స్థలం కొరత ఉంటుందని, దీనిని అధిగమించేలా రూ.వందల కోట్ల విలువైన స్థలాల్లో ఈ ఎల్ఐజీ హౌసింగ్ టవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఎల్లమ్మ కల్యాణం లోపు నిర్మాణాలు పూర్తి: పొన్నం వచ్చే ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలోపు హైద రాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో 5 నుంచి 10 అంతస్తుల అపార్ట్‌మెంట్లను నిర్మించి ప్రతి పేద కుటుంబం గౌరవప్రదంగా జీవించే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఇండ్ల నిర్మాణాలు చేపట్టే నియోజకవర్గాలు ఇవే..
రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్ గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్ పుర, అంబర్ పేట, కూకట్ పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్,
సికింద్రాబాద్, మలక్ పేట.
ఇలా అప్లై చేసుకోవాలి..
ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఎల్ఐజీ ప్లాట్‌కు ఈ నెల 21 నుంచి మీసేవ, వాట్సాప్( 8096958096), వెబ్‌సైట్ ద్వారా వచ్చే నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలని, దరఖాస్తుదారుని పేరిట క్యూర్ పరిధిలో స్థలం, సొంత ఇల్లు ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. అర్హత ప్రకారం ఇండ్ల కేటాయింపు జరుగుతుంది. 360 డిగ్రీల పరిధిలో అప్లికేషన్లను ఫిల్టర్ చేస్తారు. అప్పటికీ ఎక్కువ దరఖాస్తులు వస్తే అందరి ముందూ బహిరంగంగా లాటరీ తీసి మంజూరు చేస్తామని చెప్పారు.
