సంపన్న వర్గాల ఫోకస్ రియల్ ఎస్టేట్ పైనే.. 80 శాతానికిపైగా పెంచిన ఐఏఎఫ్లు.. ఇండ్లకు భారీ డిమాండ్

సంపన్న వర్గాల ఫోకస్ రియల్ ఎస్టేట్ పైనే.. 80 శాతానికిపైగా పెంచిన ఐఏఎఫ్లు.. ఇండ్లకు భారీ డిమాండ్
  •  గత ఆర్థిక సంవత్సరంలో  రూ.60 వేల కోట్లు
  •  వెల్లడించిన సెబీ రిపోర్ట్​


న్యూఢిల్లీ: సంపన్న భారతీయులు భారీ లాభాలు ఇచ్చే రియల్​ ఎస్టేట్​కు పెద్దపీట వేస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగంలో తమ పెట్టుబడులను 80 శాతానికి పైగా పెంచారు. పట్టణాల్లో ఇండ్లకు డిమాండ్ బలంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. సెబీ విడుదల చేసిన తాజా రిపోర్ట్​ ప్రకారం.. ధనికులు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫండ్స్​( ఏఐఎఫ్​లు) ద్వారా రియల్టీలోకి నిధులు గుమ్మరిస్తున్నారు. 

వీటిలోకి మొత్తం పెట్టుబడులు 2025లోని రూ.70వేల కోట్ల నుంచి 2026 నాటికి రూ.1.28 లక్షల కోట్లకు చేరాయి.  వివిధ రంగాలలో మొత్తం రూ.1.4 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టగా, వీటిలో 42 శాతం (రూ.60వేల కోట్లు) రియల్ ఎస్టేట్ రంగానికే వెళ్లాయి.    ఏఐఎఫ్ పెట్టుబడులు 2026లో 25 శాతం పెరిగి రూ.5.38 లక్షల కోట్ల నుంచి రూ.6.76 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

కనిష్టంగా రూ. కోటి పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ ఏఐఎఫ్​లను సంపన్నుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు.   2026లో మార్కెట్లు అనిశ్చితిని ఎదుర్కొనడం వల్లనే ఏఐఎఫ్​లు రియల్ ఎస్టేట్ వైపు భారీగా మొగ్గుచూపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు ముఖ్యంగా ట్రంప్ సుంకాలు , పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత ఏడాదిలో సెన్సెక్స్ 5.2 శాతం నష్టపోయింది.

  • స్టాక్​ మార్కెట్లను వదిలి స్థిరాస్తులవైపు..

సాధారణంగా ఏఐఎఫ్​లు స్థిరమైన ఆదాయాన్ని అందించే రుణ మార్గం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి వల్ల ఫ్యామిలీ ఆఫీసుల నిర్వాహకులు ప్రభుత్వ మార్కెట్లలోని హెచ్చుతగ్గులను నమ్ముకోకుండా, స్థిరమైన రాబడినిచ్చే ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని ఆనంద్ రాఠీకి చెందిన తన్వి కాంచన్ తెలిపారు. నగరాలలో రెసిడెన్షియల్​ డిమాండ్ నిలకడగా ఉండటం, నిర్మాణ రంగంలో అనుకూల వాతావరణం ఇందుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. 

ఈక్విరస్ క్యాపిటల్ ఎనలిస్ట్​ భవేశ్ షా మాట్లాడుతూ, గత కొన్నేళ్లలో బ్రాండెడ్ డెవలపర్లు, రెసిడెన్షియల్​ డిమాండ్, మెరుగ్గా ప్రాజెక్టులను అమలు చేయడం వంటివి ఈ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయని పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడులలో రియల్ ఎస్టేట్ 19 శాతం వాటాతో అతిపెద్ద రంగంగా నిలిచింది. ఆర్థిక సేవల రంగం రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఐటీ రంగం నిలిచింది.  

ఫార్మా రంగం అత్యంత మందకొడి వృద్ధిని సాధించాయి.  కేవలం 1.7 శాతం వృద్ధితో ఏఐఎఫ్ పెట్టుబడులు రూ.21వేల కోట్లకు చేరాయి. ఏఐ సవాళ్లను ఎదుర్కొంటున్న ఐటీ రంగంలో కూడా పెట్టుబడులు కొద్దిగా పెరిగి రూ.40వేల కోట్లకు చేరాయని సెబీ తెలిపింది.