- జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫొటోలు పట్టుకొని నిరసన
- పార్లమెంట్‌కు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు
- అడ్డుకున్న పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగం..లాఠీచార్జ్
- ప్రధాని నివాసం, సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ నిలిపివేత
- కొందరిని రౌండప్ చేసి చితకబాదిన పోలీసులు..
- లాఠీ దెబ్బలకు ఎదురునిలిచి ముందుకు సాగిన విద్యార్థులు
- నిరసనకారులతోపాటు పలువురు పోలీసులకూ గాయాలు
- పార్లమెంట్ మెయిన్ గేటు మూసివేత..
- సీజేపీ ఫౌండర్ అబిజీత్ దీప్కే దీక్ష విరమణ.. అరెస్ట్
- కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: నీట్–యూజీ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసుల ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, మద్దతుదారులు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. వీరితో పాటు పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు ఈ మార్చ్ లో పాలుపంచుకున్నారు. దీంతో జంతర్ మంతర్ వెళ్లే దారులన్నీ ఆందోళనకారులతోనే నిండిపోయాయి.
మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారా మిలటరీ బలగాలతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్‌తోపాటు పక్కనే ఉన్న పార్లమెంట్ స్ట్రీట్, రెసినా హిల్స్, ఇండియా గేట్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, సెంట్రల్ ఢిల్లీని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే, న్యూఢిల్లీ పరిధిలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ –163ను అమలు చేశారు. అయితే, ఉదయం నుంచి జంతర్ మంతర్ లోనే విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారు. 11 గంటలకు పార్లమెంట్ ప్రారంభమైన తర్వాత కాస్తా అలజడి కనిపించినా.. పోలీసులు వారిని బయటకు రాకుండా నిలువరించారు. లోపల ఉన్నవారిని బయటకు, బయటివారిని లోనికిపోకుండా ఆపారు. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంపీలు చంద్ర శేఖర్ ఆజాద్, మహువా మొయిత్రాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. చివరకు నేతలు దీప్కే నిరాహార దీక్ష చేపట్టిన వేదిక వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు.
మధ్యాహ్నం తర్వాత జంతర్ మంతర్ నుంచి కేవలం కిలో మీటర్ దూరంలో ఉన్న పార్లమెంట్ వైపుకు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కదిలారు. జాతీయ జెండాలు, అంబేద్కర్ చిత్ర పటాన్ని చేతిలో పట్టుకొని.. జై భీమ్ నినాదాలతో శాంతియుతంగా ముందుకు సాగారు. కొందరు సంసద్ మార్గ్ వైపు నుంచి పార్లమెంట్ చేరుకునేందుకు ప్రయత్నించారు. వారిని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలు ఝులిపించగా.. పలువురికి గాయాలయ్యాయి. వీరికి అక్కడికడ్కకే ప్రథమ చికిత్స అందించారు. మరోసైడ్ జంతర్ మంతర్ లోని గోల్ చక్కర్(సర్కిల్ వద్ద) నుంచి మరికొంత మంది పార్లమెంట్ వైపు కదం తొక్కారు. వీరిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే వేలాది సంఖ్యలో ఉన్న ఆందోళనకారులను అడ్డుకోవడం సాధ్యపడలేదు. ఆదే రూట్‌లో ముందుకు సాగుతూ.. రైసినా హిల్స్ మీదుగా పార్లమెంట్ వైపుకు మళ్లారు. అంచెలంచెలుగా ఏర్పాటు చేసిన భద్రతా వలయాలు, బారికేడ్లను దాటుకొని పార్లమెంట్‌కు 200 మీటర్ల దూరానికి చేరుకున్నారు. చివరగా రైల్ భవన్, పార్లమెంట్ సమీపాన ఉన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా దగ్గర ఆందోళన కారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్‌ను ప్రయోగించింది. అనంతరం లాఠీచార్జి చేసి పరిస్థితులను కంట్రోల్‌లోకి తెచ్చారు. ఈ తోపులాటలో పలువురు నిరసనకారులు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, తాము ఎలాంటి హింసకు పాల్పడలేదని, నిరసనను నిబంధనల ప్రకారమే హ్యాండిల్ చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ మెయిన్ గేట్ మూసివేత
సీజేఐ మార్చ్ పార్లమెంట్ సమీపానికి రావడంతో పార్లమెంట్ భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్‌కు ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి, ఇతర మంత్రులు, ఎంపీలు వెళ్లే మెయిన్ గేట్‌కు పార్లమెంట్ భద్రతా సిబ్బంది తాళం వేశారు. ఈ గేటును దాటుకొని వస్తే అడ్డుకునేలా ఫైర్ ఇంజన్ పైపులను పోలిన వాటర్ పైపులను సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ పరిస్థితులు చేయి దాటితే తుపాకీ కాల్పులు చేసేలా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పొజిషన్ తీసుకున్నారు. కాగా, ప్రెస్‌క్లబ్ దగ్గరి ఉద్రిక్తత పరిస్థితితో ఆ సమీపంలోని కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను మూసి వేశారు. లోపలికి ఎవరూ రాకుండా భద్రతను పెంచారు.
అభిజీత్ దీప్కే దీక్ష విరమణ
సీజేపీ చీఫ్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. సూసైడ్ చేసుకొన్న ఓ నీట్ విద్యార్థి తండ్రి విజ్ఞప్తి, పార్టీ పార్లమెంట్ మార్చ్ ను ముందుడి నడిపించాల్సిన అవసరం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న ఐసా విద్యార్థి నాయకులు నేహా, మనీశ్, అమీన్ కూడా దీక్షకు ముగింపు పలికారు. వీరితో బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఆర్జేడీ నేత రాజా రామ్ పాల్, సీపీఎం ఎంపీ అమ్రారామ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ నిమ్మ రసాలు ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. కాగా, నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా, సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక దీక్షను భగ్నం చేసినందుకు దీప్కే ఈ దీక్ష చేపట్టారు. అయితే, నిరాహార దీక్షలు ముగిసినా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు సీజేపీ పోరాటం కొనసాగుతుందని వారు ప్రకటించారు. మరోవైపు అభిజీత్ దీప్కే అరెస్ట్ పై కాసేపు గందరగోళం నెలకొన్నది. దీప్కేను పోలీసులు అరెస్ట్ చేశారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ వాదనలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. దీప్కే పోలీసుల అదుపులో లేరని, ఆయన వేదికపైనే ఉన్నాడని తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో స్పష్టత ఇచ్చారు.
అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ
మరోవైపు, పార్లమెంట్ వీధుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ప్రస్తుత పరీక్షల సంక్షోభం, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. నిరసనలు ఊపందుకున్న ఈ సమయంలో వీరి మధ్య జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.
మెట్రో స్టేషన్లు క్లోజ్..
సీజేపీ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పార్లమెంట్‌తో కనెక్ట్ అయ్యే జన్ పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియల్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో డ్యూటీకి వెళ్లే ఉద్యోగులు, సామాన్య ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే లోక్ కళ్యాణ్ మార్గ్(ప్రధాని నివాసం సమీపంలోని) మెట్రో స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని ఇంటి వైపు మార్గాల్లో రెండంచెల భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నం: సీజేపీ
మంత్రితో చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధి బృందం స్పందిస్తూ.. కేంద్ర మంత్రి తమ సమస్యలను సానుభూతితో విన్నారని, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉందని పేర్కొన్నది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కార్యకర్తలు, మద్దతుదారులు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఎంపీ డింపుల్ యాదవ్ అరెస్ట్?
నిరసనకారులతో కలిసి మార్చ్‌లో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) లోక్‌సభ ఎంపీ, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు పలువురు ఎస్పీ నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ‘‘ఢిల్లీలో విద్యార్థుల గళాన్ని వినిపిస్తున్న లోక్‌సభ ఎంపీ డింపుల్ యాదవ్‌తోపాటు ఇతర ఎస్పీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విద్యార్థులపై లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండించదగినది.. అప్రజాస్వామికం’’ అని సమాజ్‌వాదీ పార్టీ ‘ఎక్స్’ వేదికగా మండిపడింది. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ డింపుల్ యాదవ్ నేతృత్వంలోని ఎంపీల బృందం నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘ఈ రోజు యువత తమ ఆవేదనను పంచుకోవాలని చూస్తుంటే ప్రభుత్వం వినడానికి నిరాకరిస్తోంది. ప్రజలు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది” అని ఆరోపించారు.
లాఠీ దెబ్బలను లెక్క చేయని స్టూడెంట్స్..
‘చలో పార్లమెంట్’ మార్చ్ లో పాల్గొన్న నిరసనకారులపై పలు చోట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ రౌండప్ చేసుకొని మరీ లాఠీలతో చితకబాదారు. ఒక ఆందోళనకారుడిని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చుట్టు ముట్టి చావబాదింది. ఈ దెబ్బలను తట్టుకొని అలాగే నిలిచిపోయిన నిరసనకారుడు ‘ఎంతైనా కొట్టండి’ అంటూ అరుస్తోన్న వీడియో మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరోచోట ఒక యువకుడికి లాఠీచార్జీలో కాలికి తీవ్రగాయమైంది. అయినప్పటికీ.. జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్న తీరు అందరినీ కదిలించింది. ‘‘కొన్నిచోట్ల మిమ్మల్ని అడ్డగించినప్పటికీ, ప్రశాంతంగా ఉండి శాంతిని కాపాడండి. మనం శాంతి, ప్రేమతో మాత్రమే దీన్ని గెలుస్తాం” అని సీజేపీ తన మద్దతుదారులకు సూచించింది.
