- ముందు ఆ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్కోవాలె
- మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో తాగునీరు, కరెంట్ అవసరం మేరకే వాడుకోవాలని, వృథా చేయొద్దని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ప్రజాభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించగా.. మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు జుల్ఫికర్ అలీ, కౌసర్ మొహియుద్దీన్, మహమ్మద్ ముబీన్, మజీద్ హుస్సేన్, శ్రీ గణేశ్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎల్‌నినోతో వర్షాలు పడడం లేదని, రాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు ముందస్తు ప్లాన్‌తో పని చేయాలన్నారు. జిల్లాలో గ్రౌండ్ వాటర్ పెంచడానికి అవేర్‌నెస్ ప్రోగ్రాంలు నిర్వహించాలన్నారు. ముందు మంత్రుల ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. మంత్రి అజారుద్దీన్మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు అత్యంత విలువైనదని, అందుకే తాగునీటి లీకేజీలు, వృథా, పూర్తిగా నివారించాలన్నారు.
ఆ టైంలో కరెంట్ వాడకాన్ని తగ్గించండి
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పాటిల్ మాట్లాడుతూ రానున్న నెలల్లో కావాల్సిన కరెంట్అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పంపింగ్, వేడి దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నా కరెంట్ కొరత అనేది లేకుండా చేస్తామన్నారు. ఉదయం, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు కరెంట్వినియోగాన్ని తగ్గించాలన్నారు. వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి జిల్లాలో తాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గురించి వివరించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ తాగునీటి నిర్వహణ, వరదలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, ప్రజారోగ్యానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేశామన్నారు. భూగర్భ జలాల పర్యవేక్షణ, సంరక్షణను బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయి గ్రౌండ్ వాటర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు భూగర్భ జలాల శాఖ ఆఫీసర్లు వెల్లడించారు. కొత్త బోర్వెల్స్తవ్వకాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులపై నిఘాను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ ఆపం
చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిత్యావసర వస్తువుల సరఫరా, పంపిణీ నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కలెక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ.. తాగునీరు, కరెంట్ సరఫరా విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వృథా నివారణ కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. అడిషనల్కలెక్టర్జితేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే 42 శాతం లోటు వర్షపాతం
చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సురేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాధారణంగా ఇప్పటివరకు 214.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా..124.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. అంటే 42 శాతం వర్షపాత లోటు ఉన్నట్లు తెలిపారు. గతేడాది ఇదే టైంకు 165.3 మిల్లీమీటర్లు పడిందన్నారు. మండలాల వారీగా గోల్కొండ, బహదూర్‌పురా మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగిలిన 12 మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు.
