త్వరలో ఇథనాల్‌‌‌‌ ఏటీఎంలు..డబ్బాల్లో పట్టుకోవచ్చు.. ఎల్‌పీజీకి బదులు వాడుకోవచ్చు

త్వరలో ఇథనాల్‌‌‌‌ ఏటీఎంలు..డబ్బాల్లో పట్టుకోవచ్చు.. ఎల్‌పీజీకి బదులు వాడుకోవచ్చు
  •     మార్కెట్లోకి  ఇథనాల్​ స్టవ్స్​ 
  •     విమానాల ఎస్‌‌‌‌ఏఎఫ్‌‌‌‌ తయారీలోనూ ఇది కీలకం 

న్యూఢిల్లీ: భారతదేశ ఇథనాల్‌‌‌‌ ప్రయాణం సరికొత్త దశకు చేరుకుంది. గత పదేళ్లుగా పెట్రోల్‌‌‌‌లో ఇథనాల్‌‌‌‌ బ్లెండింగ్ (కలపడం) కి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఇంధన ట్యాంకులను దాటి కొత్త మార్గాలను వెతుకుతోంది. దేశంలో ఇథనాల్‌‌‌‌ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.  ఎల్‌‌‌‌పీజీకి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌‌‌‌‌‌‌‌ను వంట ఇంధనంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వినియోగదారులు ప్రత్యేక 'ఇథనాల్‌‌‌‌ ఏటీఎంల'  ద్వారా డబ్బాల్లో ఇథనాల్‌‌‌‌ కొనుగోలు చేసి, ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టవ్‌‌‌‌లలో వాడుకునేలా సరికొత్త రిటైల్ మోడల్‌‌‌‌ను పరిశీలిస్తోంది.

కొత్త సవాలు..

 పెట్రోల్‌‌‌‌లో 20శాతం ఇథనాల్‌‌‌‌ (ఈ20) కలపాలనే లక్ష్యాన్ని భారత్ గడువుకంటే ముందే సాధించింది. ప్రస్తుతం దేశ ఇథనాల్‌‌‌‌ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 2 వేల కోట్ల లీటర్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,400 కోట్ల లీటర్లకు చేరనుంది. అయితే, ప్రస్తుత దేశీయ అవసరాలకు (ఈ20, మద్యం, ఫార్మా రంగాలు కలిపి) సరిపడేది 1,400 – 1,500 కోట్ల లీటర్లు మాత్రమే. దీంతో మిగిలిన సుమారు 700 కోట్ల లీటర్ల అదనపుసామర్థ్యం కోసం కొత్త డిమాండ్‌‌‌‌ను సృష్టించాల్సి వస్తోంది.  దేశీయంగా మిగులుతున్న ఇథనాల్‌‌‌‌‌‌‌‌ను సొంత ఉత్పత్తి లేని నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు విమానయాన రంగంలో 'సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్' (ఎస్‌‌‌‌ఏఎఫ్‌‌‌‌) తయారీకి ఇథనాల్‌‌‌‌‌‌‌‌ను ముడిసరుకుగా వాడనున్నారు. దీనికోసం విశాఖపట్నంలో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, జీపీఎస్‌ రెన్యూవబుల్స్‌ కలిసి దేశంలోనే తొలి ఇథనాల్ టు జెట్ ఫ్యూయల్‌ ప్లాంట్‌ను నిర్మిస్తున్నాయి.  గతంలో ఇథనాల్‌‌‌‌ అంటే కేవలం చక్కెర పరిశ్రమ ఉప-–ఉత్పత్తిగా (చెరకు ద్వారా) మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు నీటి వినియోగం తక్కువగా ఉండే మొక్కజొన్న, ధాన్యాల నుంచి  ఇథనాల్‌‌‌‌ ఉత్పత్తి వేగంగా పెరిగింది. ప్రస్తుతం దేశీయ ఇథనాల్‌‌‌‌ సరఫరాలో ధాన్యాల వాటానే ఎక్కువగా ఉంది.

20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ బ్లెండింగ్‌‌‌‌ ఉండదు 

 పెట్రోల్‌‌‌‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతమున్న 20 శాతం (ఈ20) కంటే పెంచే ఆలోచన ఇప్పుడేమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సోమవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో దీనిపై నిర్ణయం ఆటోమొబైల్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో సైంటిఫిక్‌‌‌‌ చర్చలు జరిపిన తర్వాతే ఉంటుందన్నారు. ఈ20 ఇంధనం వల్ల ఇంజన్లు పాడవుతున్నాయనే వార్తల్లో నిజం లేదని, వాహనదారుల నుంచి ఎలాంటి  ఫిర్యాదులూ రాలేదని ఆయన పేర్కొన్నారు.