దేశంలో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి గత కొన్నేళ్లలోనే భారీగా మారిపోయింది. జీతాలు పెరుగుతున్నప్పటికీ లైఫ్ స్టైల్ ఖర్చు అంతకంటే వేగంగా పెరుగుతోంది. ఇల్లు కొనడం నుంచి పిల్లల చదువు వరకు, హెల్త్ కేర్ నుంచి ట్రిప్స్ వరకు ప్రతి ఖర్చు ఫ్యామిలీ బడ్జెట్‌పై భారంగా మారుతోంది. ఒకప్పుడు సాధారణ అవసరాలుగా భావించిన ఎన్నో విషయాలు ఇప్పుడు మధ్యతరగతి వారికి విలాసాలుగా మారిపోయాయి.
1. సొంత ఇల్లు... అందని కల:
మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కొనడం రోజురోజుకూ కష్టమవుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో చాలామంది కొనుగోలు చేయలేక అద్దె ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంటి కోసం భారీ రుణం తీసుకోవడం కూడా చాలా కుటుంబాలకు భారంగా మారుతోంది.
2. వైద్యం ఖర్చులు భారీ భారం:
హెల్త్ కేర్ ఖర్చులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఆస్పత్రి బిల్లులు, మందుల ధరలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు అన్నీ పెరగడంతో ఒకసారి అనారోగ్యం వస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
3. పిల్లల చదువు ఖర్చు పెరుగుతోంది:
మంచి విద్య అందించాలంటే ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఫీజులు లక్షల్లో ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఏడాది ఫీజుల పెంపు తల్లిదండ్రులకు మరో భారంగా మారుతోంది.
4. ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఖరీదే:
కూరగాయలు, పండ్లు, నాణ్యమైన ఆహార పదార్థాల ధరలు తరచూ పెరుగుతున్నాయి. సేంద్రియ ఆహారం కొనడం అయితే చాలా కుటుంబాలకు సాధ్యం కావడం లేదు. దీంతో తక్కువ ధరలో లభించే ఆహారానికే చాలామంది పరిమితమవుతున్నారు.
5. వినోదం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం:
కుటుంబంతో కలిసి సినిమా చూడడం, బయట భోజనం చేయడం, చిన్నపాటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒకసారి సినిమా వెళ్లాలంటే టికెట్లు, స్నాక్స్ కలుపుకుని వేల రూపాయలు ఖర్చవుతోంది.
6. రిటైర్మెంట్ కోసం పొదుపు కష్టమే:
ద్రవ్యోల్బణం పెరగడం, నిత్యావసరాల ఖర్చులు అధికం కావడంతో భవిష్యత్తు కోసం సేవింగ్స్ చాలా ఫ్యామిలీలకు కష్టంగా మారుతోంది. దీంతో పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
7. తగ్గిన ఫ్యామిలీ ట్రిప్స్:
ఒక ఫ్యామిలీ ఐదు రోజుల పర్యటనకు వెళ్లాలంటే ట్రావెల్, హోటల్, భోజనం, సందర్శనల ఖర్చు కలిపి పెద్ద మొత్తమే అవుతోంది. అందుకే సెలవుల్లో టూర్‌కు వెళ్లడం ఇప్పుడు చాలా కుటుంబాలకు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతోంది.
8. చిన్నారుల సంరక్షణ ఖర్చు:
ఉద్యోగాలు చేసే దంపతులకు డేకేర్ సెంటర్లు అవసరమవుతున్నాయి. కానీ నెలవారీ ఫీజులు కూడా వేల రూపాయల్లో ఉండటంతో ఇది మరో అదనపు భారంగా మారింది. ఈ కారణంగా కొంతమంది పిల్లలు కనాలనే ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారు.
9. కొత్త కారు కొనడం అందరికీ సాధ్యం కాదు:
గత ఐదేళ్లలో కార్ల ధరలు భారీగా పెరిగాయి. కొత్త ఫీచర్లు, తయారీ వ్యయం పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు కొత్త కారు కొనడం కష్టమవుతోంది. అయితే కొన్ని వాహనాలపై పన్ను తగ్గింపు కారణంగా కొంత ఉపశమనం లభిస్తోంది.
10. ఉద్యోగ భద్రత తగ్గుతోంది:
గిగ్ ఎకానమీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతున్నా వాటిలో ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. స్థిరమైన ఆదాయం లేకపోవడంతో కుటుంబ ఖర్చులు నిర్వహించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మరింత కష్టమవుతోంది.
సో ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు సాధారణ అవసరాలుగా భావించిన ఇల్లు, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఆరోగ్యకరమైన ఆహారం, విహారయాత్రలు వంటి అంశాలు ఇప్పుడు చాలామందికి విలాసాలుగా మారుతున్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు నియంత్రించుకోవడం, ఆర్థిక ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవడం ఈ పరిస్థితుల్లో మరింత అవసరంగా మారింది.
