'నేనేం దేశద్రోహిని కాదు.. నాకు E20 పెట్రోల్ వద్దు'.. పోర్షే కారుకు బొక్క పడుతుందంటూ నటుడు నరేష్ ఫైర్!

'నేనేం దేశద్రోహిని కాదు..  నాకు E20 పెట్రోల్ వద్దు'.. పోర్షే కారుకు బొక్క పడుతుందంటూ నటుడు నరేష్ ఫైర్!

దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న E 20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంపై సీనియర్ నటుడు నరేష్  ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను దేశద్రోహి కాదని స్పష్టం చేస్తూనే, ఈ20 పెట్రోల్ కారణంగా బైక్ వినియోగదారుల నుంచి ఖరీదైన కార్ల యజమానుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

'నా స్నేహితుడు ఇటీవల కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీ కారులో ఇంజిన్ వాల్వ్‌లు దెబ్బతిన్నాయి. వాటిని మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చైంది. ఇదే పరిస్థితి నా రూ.2.5 కోట్ల విలువైన పోర్షే పనమెరాకు వస్తే దాదాపు రూ.12 లక్షలు ఖర్చవుతుంది. అందుకే లీటరుకు రూ.165 చెల్లించి హై ఆక్టేన్-100 పెట్రోల్ వాడాల్సి వస్తోంది. మరి సామాన్య బైక్ వినియోగదారుల పరిస్థితి ఏంటి?’ అంటూ నరేష్ ప్రశ్నించారు.

తాను మాజీ బీజేపీ నాయకుడినని గుర్తు చేసిన ఆయన, పర్యావరణ పరిరక్షణ అవసరమే అయినప్పటికీ కోట్లాది వాహనదారులపై భారంగా మారేలా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. బ్రెజిల్ వంటి దేశాలు ఇథనాల్‌ను దశలవారీగా ప్రవేశపెట్టి విజయవంతమయ్యాయి. కానీ భారత్‌లో మాత్రం హడావుడిగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.

అయితే, కొందరు నెటిజన్లు పోర్షే వంటి హై-పర్‌ఫార్మెన్స్ కార్లకు కంపెనీ సూచనల ప్రకారం ప్రీమియం లేదా హై ఆక్టేన్ ఇంధనమే ఉపయోగించాలని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన నరేష్, తన పోర్షే గురించి మాత్రమే కాదని, దేశంలోని కోట్లాది సాధారణ వాహనదారుల సమస్యను ప్రస్తావిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ20 పెట్రోల్‌పై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది.