కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వేలాది మంది సీజేపీ సపోర్టర్స్ పార్లమెంట్ ముట్టడికి యత్నించడంతో పార్లమెంట్ వీధులు రణరంగంగా మారాయి. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్‎లో దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని స్టేషన్‏కు తరలిస్తున్నారు. అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. 

ఈ సందర్భంగా సీజేపీ కార్యకర్తలకు మద్దతు తెలపాలని ఆయన ఎంపీలను కోరారు. మరోవైపు.. దీప్కేను అరెస్ట్ చేసిన సీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గడం లేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పోలీసులపై చెప్పులు, వాటర్ బాటిల్స్ విసిరేశారు ఆందోళనకారులు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, సీజేపీ సపోర్టర్స్ గాయపడ్డారు.

కాగా, నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న చలో పార్లమెంట్ కార్యక్రమానికి క్రాకోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.  సీజేపీ పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకుని చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీజేపీ పార్లమెంట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 

అనుమతి లేదని సీజేపీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ యువత వెనక్కి తగ్గకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించింది. 

సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు పార్లమెంట్ గేట్స్ క్లోజ్ చేసి సీజేపీ సపోర్టర్స్ ను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్లమెంట్‌ బయట ఫైర్‌ బ్రిగేడ్లతో భారీగా పోలీసులను మోహరించారు. పార్లమెంట్ బయట సీజేపీ.. లోపల ప్రతిపక్షాల నిరసనలతో సోమవారం (జులై 20) దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది.