కెనడాలో చదవాలనే కలతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఏటా దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అదే కల నెరవేరడం రోజురోజుకూ కష్టమవుతోంది. ఒకప్పుడు భారత విద్యార్థులకు అత్యంత డెస్టినేషన్ అయిన కెనడా.. ఇప్పుడు స్టూడెంట్ వీసాలపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. దీంతో వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి.
కెనడా ప్రభుత్వం 2026-2028 ఇమ్మిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్‌లో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే కొత్త స్టడీ పర్మిట్ల సంఖ్యను భారీగా తగ్గించింది. దీని ప్రభావం భారత విద్యార్థులపై స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఏప్రిల్‌లో భారతీయులకు 36వేల 510 స్టడీ పర్మిట్లు జారీ కాగా.. 2025 ఏప్రిల్‌లో ఆ సంఖ్య 6వేల 895కు పడిపోయింది. 2026 ఏప్రిల్ నాటికి అది మరింత తగ్గి 5వేల 795కు చేరింది. వీటిలో కొత్త పర్మిట్లతో పాటు రెన్యువల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. 2025 నాటికి విదేశాల్లో చదువుతున్న సుమారు 12 లక్షల 54వేల మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది కెనడాలోనే ఉన్నారు. అయితే తాజా నిర్ణయాల కారణంగా ఈ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.
ఒకప్పుడు కెనడాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులే మెజారిటీగా ఉండేవారు. 2015లో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 14.6 శాతం మాత్రమే ఉండగా, 2018లో చైనాను దాటి మొదటి స్థానానికి చేరుకున్నారు. 2022లో ఈ వాటా 41.2 శాతానికి చేరినా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025లో భారతీయుల వాటా 24.6 శాతానికి పడిపోయింది. 2023లో కెనడాలో సుమారు 2లక్షల 78వేల మంది భారతీయ విద్యార్థులు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 93వేల 915కు తగ్గింది. ఇదే సమయంలో భారత విద్యార్థుల స్టడీ పర్మిట్ రిజెక్షన్ల రేటు కూడా భారీగా పెరిగింది.
కెనడా మాత్రమే కాదు.. భారత విద్యార్థులు ఎక్కువగా ఎంచుకునే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా వీసా రూల్స్ కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య తగ్గగా.. ఆస్ట్రేలియా భారత విద్యార్థుల వీసా దరఖాస్తులను 'హైయెస్ట్ రిస్క్' కేటగిరీలోకి మార్చింది. ఈ పరిణామాలు విదేశాల్లో ఉన్నత విద్యపై ఆశలు పెట్టుకున్న భారత విద్యార్థులకు కొత్త సవాళ్లను తీసుకొస్తున్నాయి. అందువల్ల కోర్సు ఎంపికతో పాటు దేశాల వీసా విధానాలు, ఉద్యోగ అవకాశాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ముందుగానే పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు గతంలో కంటే మరింత కీలకంగా మారింది.
