వరదలు, తుఫాన్లు, భారీ వర్షాలు, ఎండల తీవ్రత.. ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో నష్టం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వారాలు, నెలలు ఎదురుచూడాల్సి వస్తే బాధితులకు మరింత ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా ఆర్థిక సాయం అందించేందుకు కొత్త తరహా ఇన్సూరెన్స్ విధానం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అదే ‘పారామెట్రిక్ ఇన్సూరెన్స్’. ఇది నష్టం ఎంత జరిగిందన్నది కాకుండా.. ముందే నిర్ణయించిన వాతావరణ పరిస్థితులు నమోదైతే వెంటనే నిర్ణీత మొత్తాన్ని చెల్లించే విధానంతో పనిచేస్తుంది.
సాధారణ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ పొందాలంటే ముందుగా జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలించాలి. ఆ తర్వాతే పరిహారం ఎంత ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటారు. కానీ పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌లో ఈ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలోనే ఏ పరిస్థితి ఏర్పడితే క్లెయిమ్ వర్తిస్తుందో, ఆ వివరాలను నిర్ధారించే డేటా ఏదో, ఎంత మొత్తం చెల్లించాలనేది ముందుగానే నిర్ణయిస్తారు. ఉదాహరణకు నిర్దిష్ట స్థాయికి మించి వర్షపాతం నమోదైనా, గాలి వేగం ఒక పరిమితిని దాటినా లేదా ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయికి చేరినా ఆటోమేటిక్‌గా క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ ఇన్సూరెన్స్ ముఖ్యంగా గిగ్ వర్కర్లు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వాణిజ్య పంటలు పండించే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. భారీ వర్షాలు, తీవ్రమైన ఎండలు లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా పని చేయలేక ఆదాయం కోల్పోయే వారికి ఇది తక్షణ ఆర్థిక ఊరటను అందిస్తుంది. నష్టం అంచనా పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం వల్ల అత్యవసర ఖర్చులను వెంటనే నిర్వహించే అవకాశం లభిస్తుంది. వ్యాపార సంస్థలు కూడా తమకు సంభవించే తక్షణ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అవసరమైన మేరకు మాత్రమే ఈ కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.
పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన వాతావరణ సూచికలు అధికారిక డేటా ద్వారా నిర్ధారించబడగానే పరిహారం విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో సర్వేలు, నష్టం అంచనాలు, ఎక్కువ పేపర్‌వర్క్ వంటి ప్రక్రియలు అవసరం ఉండవు. క్లెయిమ్ ఎప్పుడు వస్తుందో అనే టెన్షన్ తగ్గుతుంది. ఈ పారదర్శకత వల్ల పాలసీదారులకు ముందుగానే స్పష్టత ఉంటుంది.
అయితే పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సంప్రదాయ బీమాకు ప్రత్యామ్నాయం కాదు. ఇది ముందుగా నిర్ణయించిన సంఘటనలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ కొంత నష్టం జరిగినా పాలసీలో నిర్ణయించిన ట్రిగ్గర్ స్థాయి నమోదు కాకపోతే క్లెయిమ్ రాదు. అలాగే వాస్తవ నష్టం నిర్ణయించిన మొత్తానికి మించి ఉన్నా.. తక్కువ ఉన్నా చెల్లించే పేమెంట్ మాత్రం ముందుగా ఫిక్స్ చేసినదే ఉంటుంది. అయినప్పటికీ ప్రకృతి విపత్తులు పెరుగుతున్న ఈ కాలంలో అత్యవసర ఆర్థిక సహాయం అందించే పరిష్కారంగా పారామెట్రిక్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది.
