వెలుగు ఓపెన్ పేజీ : ఆత్మగౌరవం నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ

వెలుగు ఓపెన్ పేజీ :  ఆత్మగౌరవం నుంచి అభివృద్ధి వైపు  తెలంగాణ

దశాబ్దాల నిరీక్షణ,  అనేక ఉద్యమాలు,  వేలాది మంది విద్యార్థులు,  ఉద్యోగులు,  రైతులు,  మేధావులు,  కళాకారులు, సామాన్య ప్రజల అంకితభావం, వందలాది మంది  అమరుల త్యాగాల  ఫలితంగా  సాధించుకున్న  స్వరాష్ట్రం  తెలంగాణ  పన్నెండేళ్ల  ప్రస్థానాన్ని  పూర్తి  చేసుకుంది.   ఈ పుష్కర కాలం  తెలంగాణకు ఒక మైలురాయి.  

ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ

ఉద్యమ రోజుల్లో యువత గర్వంగా  గుండెలపై  రాసుకున్న ‘టీజీ’ అనే రెండు అక్షరాలు  నేడు  ఒక  ప్రత్యేక  అస్తిత్వానికి ప్రతీకగా నిలిచాయి.    పెండింగ్‌‌లో ఉన్న  ‘జయ జయహే తెలంగాణ’  గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించడం ద్వారా ఉద్యమ స్ఫూర్తికి గౌరవం దక్కింది.  తెలంగాణ తల్లి విగ్రహానికి మరింత  సహజసిద్ధమైన రూపాన్ని ఇవ్వడం ద్వారా  శ్రమజీవి  తెలంగాణ ఆత్మను  ప్రతిబింబించే  ప్రయత్నం జరిగింది.  బతుకమ్మ, బోనాలు,  సమ్మక్క- సారలమ్మ జాతర వంటి  తెలంగాణ సంస్కృతి వేడుకలకు మరింత ప్రాధాన్యత లభించింది.  ఎన్నికల  సమయంలో ప్రకటించిన గ్యారంటీలు అమలులోకి రావడం  ద్వారా మహిళలు, రైతులు,  విద్యార్థులు,  సామాన్య  కుటుంబాలకు  నేరుగా లబ్ధి  చేకూరుతోంది.  

ఉద్యోగ నియామకాల వేగం

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా యువతలో ఉద్యోగాలపై భారీ ఆశలు కొనసాగాయి.    కోర్టుల్లో  పెండింగ్‌‌లో ఉన్న వివిధ నియామక ప్రక్రియలకు చట్టపరమైన పరిష్కారాలు కనుగొని పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టడం నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చింది. దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల  భర్తీ  తెలంగాణ  యువతలో  కొత్త ఆశలను నింపింది.  గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య,  రెవెన్యూ,  విద్యుత్  తదితర  విభాగాల్లో  నియామక ప్రక్రియ  వేగవంతం కావడం  రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు  కూడా బలాన్నిచ్చింది.  ప్రభుత్వ ఉద్యోగాల  వయోపరిమితిని  పదేళ్లు పెంచడం ద్వారా మరింత మంది యువతకు అవకాశాలు లభించాయి. 

విద్యారంగంలో కొత్త ఆలోచనలు

గత  రెండున్నరేళ్లలో  విద్యారంగంలో పలు వినూత్న కార్యక్రమాలు  ప్రారంభమయ్యాయి.  తెలంగాణ  పబ్లిక్ స్కూల్స్,  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి  కాన్సెప్ట్‌‌ల  ద్వారా గ్రామీణ, పేద విద్యార్థులకు  కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యం కనిపిస్తోంది.  గురుకుల పాఠశాలల బలోపేతం,  విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపు,  హాస్టల్ సదుపాయాల  మెరుగుదల వంటి  చర్యలు  విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.  ఉన్నత విద్యలో  విదేశీ  విద్యావకాశాలు,  నైపుణ్యాభివృద్ధి  కార్యక్రమాలు కూడా యువత భవిష్యత్తుకు  దోహదపడుతున్నాయి.

వ్యవసాయం, సాగునీటి పరిరక్షణ

 కృష్ణా,  గోదావరి  జలాల  విషయంలో  తెలంగాణ  హక్కులను  కాపాడుకోవడంలో  ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబిస్తోంది.  సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ,  చెరువుల  పునరుద్ధరణ,  కాలువల మరమ్మతులు వంటి అంశాలపై దృష్టి పెరిగింది.  వ్యవసాయ రంగంలో  రైతు రుణమాఫీ,  పంటల కొనుగోలు, మద్దతు ధర, విద్యుత్ సరఫరా,  సాగునీటి అందుబాటు వంటి అంశాలు రైతులకు  కొంత  భరోసానిస్తున్నాయి.   గ్రామీణ  తెలంగాణలో అనేక  కుటుంబాలను ఇబ్బంది
పెట్టిన  ప్రధాన సమస్యల్లో భూ వివాదాలు ఒకటి.    ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన  ‘భూ భారతి’ కార్యక్రమం  భూ రికార్డుల్లో  పారదర్శకత  తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.  

మహిళా సాధికారతకు ప్రాధాన్యం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడింది. డ్వాక్రా మహిళా  సంఘాలకు వడ్డీ లేని రుణాలు,  ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.  స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతోంది.  

ఉద్యమకారులకు గౌరవం

తెలంగాణ  ఉద్యమంలో  పాల్గొన్న  విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు,  సామాన్య ప్రజల పాత్ర చిరస్మరణీయం. ఉద్యమకారులను గుర్తించేందుకు  ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యమస్ఫూర్తికి ప్రభుత్వం గౌరవం తెలిపింది.    యువత ఆకాంక్షలకు అనుగుణంగా,  రైతుల ఆశలకు భరోసాగా,  మహిళా సాధికారతకు బాటలు వేస్తూ  సమాన అవకాశాల  సమాజంగా  తెలంగాణ ఎదగాల్సిన అవసరం ఉంది. 

 

- రమేశ్​ పాక,
జనరల్​ సెక్రటరీ,
తెలంగాణ తహసీల్దార్స్​ అసోసియేషన్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.