వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకును చంపి మిస్సింగ్ డ్రామా ఆడింది ఓ తల్లి.. అంతే కాకుండా మిస్సింగ్ కేసును పోలీసులు పట్టించుకోవట్లేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఏడాదిన్నర తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా... అసలు నిజం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని...తల్లి ప్రియుడితో కలిసి కొడుకును చంపి ఊరి బయట పాతిపెట్టిందని తేలింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో జరిగింది. కౌతాళం మండలం బాదినేహాలు గ్రామంలో చిన్నమల్లయ్య, గంగమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒ కూతురు ఉన్నారు. చిన్నమల్లయ్య కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ క్రమంలో గంగమ్మకు ఆదోని మండలానికి జి. హోసల్లి గ్రామానికి చెందిన బంధువు దుర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
దుర్గప్ప తరచూ తమ ఇంటికి రావడం గంగమ్మ పెద్ద కొడుకు వీరేష్ కు నచ్చకపోవడంతో గొడవకు దిగేవాడు. దీంతో వీరేష్ ను అడ్డు తొలగించుకోవాలని గంగమ్మ, దుర్గప్ప ప్లాన్ వేశారు. ఈ క్రమంలో 2024 నవంబర్ లో వీరేష్ ను ఇంట్లోనే కత్తితో పొడిచి చంపేశారు. వీరేష్ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి.. బైక్ ప తీసుకెళ్లి ఊరి బయట స్మశానంలో పాతిపెట్టారు గంగమ్మ, దుర్గప్ప. ఆ తర్వాత అసలు డ్రామాకు తెర లేపింది గంగమ్మ. తన కొడుకు కనిపించడం లేదని..కౌతాళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు.
ఈ క్రమంలో తన కొడుకు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించడం లేదంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది గంగమ్మ. హైకోర్టుకు వెళితే డబ్బులు వస్తాయని కొందరు సలహా ఇవ్వడంతో ఆశపడి కోర్టుకెళ్లింది గంగమ్మ. తన కుమారుడి మిస్సింగ్ కేసు తేలలేదని.. పోలీసులు సరిగ్గా వెతకడం లేదని కోర్టులో పిటిషన్ వేసింది గంగమ్మ. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కోర్టు వీరేష్ అదృశ్యంపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సిట్ ను నియమించి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.
సిట్ దర్యాప్తులో గంగమ్మ ఆడిన డ్రామా బయటపడింది. వీరేష్ ను గంగమ్మ, దుర్గప్పలు కలిసి చంపేశారని నిర్దారించారు పోలీసులు. వీరేష్ మృతదేహాన్ని వెలికితీయగా.. అస్థిపంజరం దగ్గర దొరికిన తాడు, టవల్, దుప్పటి చూసి అవి వీరేష్ వేనని గుర్తించారు కుటుంబసభ్యులు. అస్థిపంజరం శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని తెలిపారు పోలీసులు.
అయితే.. గంగమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా... ఆదివారం ( మే 31 2026 ) అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గంగమ్మ ఆదివారం మరణించింది. మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య బదినేహాలుకు తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు జరిపించారు.
ఈ క్రమంలో గంగమ్మడి లాకప్ డెత్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణకు తీసుకెళ్లక లాకప్ లోనే మరణించిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు.
