తెలంగాణ జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో దాదాపు 30 లక్షల ఓట్లు.. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 9 శాతం ఓట్లు తొలగించబడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3.4 కోట్ల ఓటర్లలో జూన్ 4 నాటికి 68.72 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. డేటా ఫ్రీజింగ్ గడువు అయిన జూన్ 10 నాటికి ఇది గరిష్టంగా 72 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాపింగ్ ప్రక్రియలో లేని వారు.. ఆ తదుపరి దశ అయిన ఇంటింటి గణనలో తమ వివరాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే దాదాపు 30 లక్షల మంది ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు కేవలం 44.87 శాతం ఓటర్ల మ్యాపింగ్ మాత్రమే పూర్తయింది. ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండటం, డూప్లికేట్ ఓట్లు కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం.
బీహార్, గుజరాత్, రాజస్థాన్ వంటి ఉత్తర రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. సంగారెడ్డిలో కూడా కేవలం 56 శాతం మ్యాపింగ్ మాత్రమే నమోదైంది. వీరికి సొంత రాష్ట్రాల్లో ఇప్పటికే మ్యాపింగ్ జరిగి ఉండటంతో ఇక్కడ ప్రక్రియ నెమ్మదించింది. ఈ ప్రక్రియ ముగిసేసరికి డూప్లికేట్ ఓటర్లకు పూర్తిగా చెక్ పడనుంది. వలసలు తక్కువగా ఉన్న గ్రామీణ జిల్లాలు ఈ మ్యాపింగ్‌లో దూసుకుపోతున్నాయి. జనగాం 93.13 శాతం, మహబూబాబాద్ 93.93 శాతంతో ముందంజలో ఉన్నాయి.
కీలక షెడ్యూల్ , గడువులు
- జూన్ 15 నుంచి జూన్ 24 వరకు ప్రాథమిక సన్నాహాలు, అధికారిక శిక్షణ , డాక్యమెంట్స్ ప్రింటింగ్ జరుగుతుంది.
- జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓ (BLO)ల ద్వారా ఇంటింటి గణన ప్రక్రియ నిర్వహిస్తారు.
- జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు.
- జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు తమ క్లెయిమ్‌లు,అభ్యంతరాలను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తారు.
- జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈఆర్ఓ (ERO)ల ద్వారా నోటీసుల జారీ, విచారణలు,సమస్యల పరిష్కారం ఉంటుంది.
- అక్టోబర్ 1, 2026: అన్ని సవరణలతో కూడిన తుది, కొత్త ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.
