ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని.. ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కూడా ఖచ్చితంగా ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆర్టీసీ సిబ్బంది కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ప్రకటించారు. రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ మంత్రి కీలక ప్రకటన చేశారు. గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుమారుడు హేమంత్‌కు ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తాం, అలాగే వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పారు.
ALSO READ : గోద్రెజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లా రైతులకు వరం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మిక సంఘాలను ఎత్తివేసి, నిరంకుశంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం రాగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్టీసీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తూ.. ప్రభుత్వం నెలకు రూ. 300 కోట్లను ఆర్టీసీకి విడుదల చేస్తోందని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల పనిభారం పెరిగినప్పటికీ, కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. రక్షాబంధన్ రోజున కూడా సోదరులకు రాఖీలు కట్టి మరీ విధులకు హాజరైన మహిళా సిబ్బంది సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
