భారతీయ వ్యాపార రంగంలో జీరో నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించిన సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’ అధినేత రాజేష్ మెహతా ప్రయాణం కూడా ఒకటి. కేవలం 12 వందల రూపాయల అప్పుతో మొదలైన ఆయన ప్రయాణం.. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనింగ్ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగేలా చేసింది. అయితే దశాబ్దాల పాటు వెలిగిపోయిన ఆ బంగారు కిరీటం ప్రస్తుతం సెబీ ఉచ్చులో చిక్కుకుంది.
ఎవరీ రాజేష్ మెహతా? ఎక్కడ పుట్టారు?
రాజేష్ జస్వంత్ రాయ్ మెహతా 1964 జూన్ 20న బెంగళూరులో ఒక సామాన్య మధ్యతరగతి జైన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జస్వంత్ రాయ్ మెహతా గుజరాత్ లోని మోర్బీ ప్రాంతం నుండి 1946లో బెంగళూరుకు వలస వచ్చారు. మొదట్లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత రత్నాలు ట్రేడింగ్ చేస్తూ ‘రాజేష్ డైమండ్ కంపెనీ’ని ప్రారంభించారు. రాజేష్ మెహతా బెంగళూరులోనే చదువుకున్నారు. నిజానికి ఆయన డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. అయితే ఫ్యామిలీ పరిస్థితుల వల్ల తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.
బిజినెస్ కెరీర్ ఎలా, ఎక్కడ ప్రారంభమైంది?
రాజేష్ మెహతా తన వ్యాపార ప్రయాణాన్ని చాలా వినూత్నంగా ప్రారంభించారు. తన అన్నయ్య బిపిన్ దగ్గర రూ.1,200 అప్పుగా తీసుకుని వెండి ఆభరణాల ట్రేడింగ్ మొదలుపెట్టారు. చెన్నై నుంచి వెండి నగలు కొని, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న తమ బంధువులకు లాభానికి అమ్మేవాడు. అక్కడ వచ్చిన డబ్బుతో మళ్లీ గుజరాత్ వెండి డిజైన్లను కొని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో హోల్‌సేలర్లకు అమ్మేవాడు. రాజేష్ ఆర్ట్ జ్యువెలర్స్ పేరుతో వస్తుమార్పిడి పద్ధతిని ప్రవేశపెట్టి ప్రతి బిజినెస్ సైకిల్‌లోనూ 50% లాభాలను ఆర్జించాడు.
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ స్థాపన..
వెండి వ్యాపారంలో పట్టు సాధించాక.. 1989లో రాజేష్ మెహతా తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి బెంగళూరులోని ఒక చిన్న గ్యారేజీలో 10 మంది కార్మికులతో గోల్డ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అదే ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’. దేశంలోనే మొట్టమొదటి ఆర్గనైజ్డ్ గోల్డ్ జ్యువెలరీ తయారీ, R&D కేంద్రాన్ని వీరు స్థాపించారు. 1995లో ఈ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయింది. 2015లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ ‘వాల్‌కాంబీ’ని కొనుగోలు చేయడంతో రాజేష్ మెహతా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఒక దశలో ప్రపంచంలోని మొత్తం బంగారంలో 35% వీరే ప్రాసెస్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించుకుంది.
ALSO READ : రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో LIC పెట్టుబడులు ఎంత..?
గోల్డ్ సామ్రాజ్యం.. సెబీ దృష్టిలో ఎందుకు పడింది?
2024 మార్చిలో ఒక షేర్ హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదుతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ పై సెబీ విచారణ ప్రారంభించింది. రెండేళ్లకు పైగా ట్రేడ్ రిసీవబుల్స్ అంటే రావాల్సిన బాకీలు ఖాతాల్లో అలాగే ఉండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 వరకు ఐదేళ్ల కాలంలో కంపెనీ ఏకంగా రూ.15లక్షల 15వేల కోట్ల మేర తమ రెవెన్యూ నంబర్లను అదనంగా, తప్పుగా చూపించిందని సెబీ 109 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కంపెనీ చూపించిన దాదాపు 97% నుండి 99% ఆదాయం కేవలం కాగితాల మీదే సృష్టించబడిందని సెబీ తీవ్ర ఆరోపణలు చేసింది. దర్యాప్తుకు సహకరించకపోవడం, నిధుల మళ్లింపు వంటి కారణాల వల్ల రాజేష్ మెహతాను మార్కెట్ లావాదేవీల నుండి సెబీ తాత్కాలికంగా నిషేధించింది కూడా.
సెబీ ఆరోపణలపై రాజేష్ మెహతా రియాక్షన్ ఏంటి?
* సెబీ జారీ చేసిన ఆర్డర్‌పై రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఛైర్మన్ రాజేష్ మెహతా గట్టిగా స్పందించారు.
* తమ కంపెనీ ఎలాంటి తప్పు చేయలేదని, తాము ప్రకటించిన ఆదాయాలు 100 శాతం కరెక్ట్ అని స్పష్టం చేశారు.
* సెబీకి తమకు మధ్య ఒక పెద్ద "కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కన్‌ఫ్యూజన్" జరిగిందని రాజేష్ అన్నారు.
* స్విస్ రిఫైనరీ ‘వాల్‌కాంబీ’కి సంబంధించిన EBITDA - లాభాలను.. టర్నోవర్ లెక్కలుగా సెబీ తప్పుగా పరిగణించడం వల్లే ఈ 97% వ్యత్యాసం చూపిస్తోందని రాజేష్ మెహతా వివరణ ఇచ్చారు.
* సెబీ ఇచ్చింది కేవలం ఒక మధ్యంతర ఆర్డర్ మాత్రమేనని, దీనిపై ఎలాంటి ఫైన్, పెనాల్టీలు పడలేదని చెబుతూ.. పూర్తి ఆధారాలు, అథెంటికేటెడ్ డాక్యుమెంట్లను సెబీకి సమర్పించి తమ నిజాయితీని నిరూపించుకుంటామని రాజేష్ మెహతా ధీమా వ్యక్తం చేశారు.
