T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ రేపు ( మార్చి 8న) జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ భారత మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ ఫైనల్‌లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు వారు 2011 వన్డే ప్రపంచకప్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చాయి. ఆ టోర్నమెంట్‌లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఆ టోర్నమెంట్లో మెన్ ఇన్ బ్లూ కేవలం దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే ఓడింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో భారత్ సూపర్–-8 దశలో ప్రోటీస్ చేతిలోనే ఓడిపోయింది.
2011 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి కూడా సెమీఫైనల్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడంతో సౌతాఫ్రికా జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ విధంగా అప్పటి సంఘటనలు ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్నాయని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అందుకే రేపు జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక టీమ్స్ పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా.. ఈసారి టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక అయింది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా రేపు జరిగే టైటిల్ పోరులో భారత్ మరోసారి ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో జరిగే ఈ తుది పోరులో విజయం సాధిస్తే టీమిండియా మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండోసారి టైటిల్‌ని దక్కించుకున్న తొలి జట్టుగా భారత్ నిలవనుంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కొనసాగనుంది. ఇరు టీమ్స్ పోటీపోటీగా ప్రోక్టీస్ చేస్తున్నాయి. ఫైనల్ లో ట్రోపీ గెలిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి.
