- సింగరేణి బిడ్డ సృజనకు 55వ ర్యాంక్
- 123వ ర్యాంక్‌తో మెరిసిన ఓరుగల్లు యువకుడు
- నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్
- వెంకటేశ్‌కు 358వ ర్యాంక్
- మేడ్చల్ జిల్లాలో అన్నదమ్ములకు ర్యాంకులు
- ఆలిండియా టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి
- రాజేశ్వరి సువేకు 2, ఆకాన్ష్ ధుల్‌కు మూడో ర్యాంకు
నెట్వర్క్, వెలుగు: యూపీఎస్సీలో తెలంగాణ యూత్సత్తాచాటారు. సింగరేణి కార్మికుడి కూతురు.. అటెండర్ కొడుకు.. రైతు బిడ్డలు.. ఇలా సామాన్య కుటుంబాలకు చెందిన యువతీ యువకులు సివిల్స్‌లో ర్యాంకులు కొట్టారు. మారుమూల గ్రామాల నుంచి అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల గ్రూప్1కు ఎంపికైన వారే ఉండడం విశేషం.
ఓరుగల్లు యువకుడికి 123వ ర్యాంక్
వరంగల్‌లోని కాజీపేట ప్రశాంత్ నగర్‌కు చెందిన టీచర్ దంపతులు అట్ల రవీందర్, అట్ల అమరావతి కొడుకు అట్ల తరుణ్ తేజ యూపీఎస్సీలో 123వ ర్యాంకు సాధించాడు. ఐఐటీ ముంబైలో సీఎస్సీలో బీటెక్ పూర్తి చేసిన తరుణ్ తేజ.. ఐఆర్ఎంఎస్ లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయి రెండో ప్రయత్నంలో 123 వ ర్యాంకు సాధించాడు. వీరి స్వగ్రామం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కామారం. అలాగే, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్‌లో 358 ర్యాంకు సాధించాడు. ఈయన స్వస్థలం మూసాపేట మండలం నిజాలాపూర్. వెంకటేశ్ తండ్రి సత్యనారాయణ సాగర్ నారాయణపేట జిల్లా విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తున్నారు.
వెంకటేశ్ నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే, వరంగల్ హంటర్ రోడ్డు న్యూ శాయంపేట చెందిన గుండు శివకుమార్, సరస్వతి దంపతుల కొడుకు అఖిలేశ్ యూపీఎస్సీ ఫలితాల్లో 464 ర్యాంక్ సాధించాడు. అఖిలేశ్ తండ్రి శివకుమార్ భూపాలపల్లిలో ఏఆర్ ఎస్సై గా పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన భేతి అరుణ, మల్లేశం దంపతుల కొడుకు భేతి విక్రమ్ యూపీఎస్సీ ఫలితాల్లో 472 ర్యాంక్ సాధించాడు. వీరిది వ్యవసాయ కుటుంబం.
విక్రమ్.. గ్రూప్స్ ఎగ్జామ్ లో ప్రతిభ చాటి సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎంపీడీవోగా పని చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ఇద్దరు అభ్యర్థులు సివిల్స్ ర్యాంకు సాధించారు. జనగామ జిల్లాకు చెందిన మెరుగు సుధాకర్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. వీరు ప్రస్తుతం హబ్సీగూడలో నివాసం ఉంటున్నారు. సుధాకర్ కొడుకు కౌశిక్ మొదటిసారి సివిల్స్ పరీక్షలో 82వ ర్యాంకు సాధించి, ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో రెండోసారి ఎగ్జామ్ రాయగా, 399వ ర్యాంక్ సాధించారు. అలాగే, మేడ్చల్ పట్టణానికి చెందిన దీపక్ శర్మ రెండోసారి సివిల్స్ పరీక్ష రాయగా, 951వ ర్యాంక్ సాధించారు.
రాజేశ్వరి సువేకు 2, ఆకాన్ష్ ధుల్ కు 3వ ర్యాంకు
న్యూఢిల్లీ: సివిల్స్ తుది పరీక్షా ఫలితాల్లో 958 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో జనరల్ కేటగిరి నుంచి 317 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ నుంచి 158, ఎస్టీ నుంచి 78 మంది ఉన్నారని యూపీఎస్సీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. వీరిలో అనూజ్ అగ్నిహోత్రి ఫస్ట్ ర్యాంకు, రాజేశ్వరి సువే రెండో ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. వీరితో పాటు రాఘవ్ ఝున్ ఝున్ వాలా, ఇషాన్ భట్నాగర్, జినియా అరోడా, రజా మొహియిద్దీన్, పక్షల్ సెక్రటరీ, ఆస్థా జైన్, ఉజ్వల్ ప్రియాంక్ వరుసగా టాప్ 10లో నిలిచారు.
కాగా.. పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను 15 రోజుల్లోపు యూపీఎస్సీ వెబ్ సైట్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వర్కింగ్ డేస్ లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా ఆ కేంద్రాలకు వెళ్లి లేదా 23385271, 23381125, 23098543 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
ఐదో ప్రయత్నంలో 55వ ర్యాంకు సాధించిన సృజన
పెద్దపల్లి జిల్లా రామగుండం సెంటినరీకాలనీ క్వార్టర్లలో ఉంటూ ఓపెన్ కాస్ట్ 1లో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గూడెల్లి రాజేశం, రాణి దంపతుల కూతురు సృజన యూపీఎస్సీ ఫలితాల్లో 55వ ర్యాంకు సాధించింది. ఎల్కే జీ నుంచి 10వ తరగతి వరకు సెంటినరీకాలనీలోని వాణి హైస్కూల్ లో, ఇంటర్ హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో చదివింది. 2018లో మంథని జేఎన్టీయూలో బీటెక్ (సీఎస్సీ) కంప్లీట్ చేసింది.
బీటెక్ పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకొని.. ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్ భగవత్‌ను కలిసి ఆయన సూచనతో 2019లో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంది. ఈ మధ్య తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రాసిన సృజన.. 35వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైంది. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఇప్పటికి నాలుగు సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా.. కొద్ది మార్కుల తేడాతో ఎంపిక కాలేకపోయింది. ఐదో ప్రయత్నంలో తాను అనుకున్న గోల్ సాధించింది.
మూడో ప్రయత్నంలో ర్యాంక్
జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన పూదరి రాహుల్ సివిల్స్ ఫలితాల్లో 748వ ర్యాంక్ సాధించాడు. రాహుల్ తల్లిదండ్రులు పూదరి గంగలక్ష్మి, మల్లేశం. బాసర ట్రిపుల్‌ఐటీలో బీటెక్ పూర్తి చేసిన రాహుల్.. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి, జ్యోతి దంపతుల కొడుకు శ్రావణ్ కుమార్ యూపీఎస్సీ ఫలితాల్లో 768 ర్యాంకు సాధించారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ - 1 ఫలితాల్లో స్టేట్ లెవల్ లో 23వ ర్యాంకు సాధించి హైదరాబాద్ లో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ సివిల్స్ లో 793వ ర్యాంకు సాధించారు. అనారోగ్య కారణాలతో ప్రవీణ్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోయారు.
అప్పటి నుంచి గ్రామ పంచాయతీలో దినసరి వేతనంపై పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ అతని నాన్నమ్మ దైనంపల్లి ఎల్లమ్మ ప్రవీణ్ తోపాటు అతని తమ్మున్ని పెంచి పోషించింది. ప్రవీణ్.. ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని గ్రూప్-1 పరీక్షల్లో 105వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికై శిక్షణ పొందుతున్నాడు.
ఒకేసారి సివిల్స్కొట్టిన అన్నదమ్ములు
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి సివిల్స్కొట్టారు. ఒకరు 541 ర్యాంకు , మరొకరు 682 ర్యాంకు సాధించారు. ఇప్పటికే గ్రూప్1 ఆఫీసర్లుగా కొనసాగుతున్న వీరు.. అనుకున్న లక్ష్యాన్ని ఒకేసారి చేధించారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన అలివేలు అంజిరెడ్డి దంపతులకు నలుగురు పిల్లలు. గౌతమి, అర్చన, విక్రమ్ సింహా రెడ్డి, విజయ సింహారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. పిల్లల చదువుల కోసం వారి చిన్నప్పుడే వనస్థలిపురం వచ్చి సెటిల్అయ్యారు.
చిన్నవాడు విక్రమ్ సింహా రెడ్డి ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. ఇటీవల గ్రూప్1 ర్యాంక్సాధించి అడిషనల్ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. శిక్షణ కొనసాగిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఆరో అటెంప్ట్‌లో 541 ర్యాంకు సాధించాడు. ఇక పెద్దవాడు విజయ సింహారెడ్డి. శ్రీనిధి కాలేజీలో కంప్యూటర్స్ పూర్తి చేశాడు. ఇతడు కూడా గ్రూప్1 ర్యాంక్సాధించి వనపర్తి జిల్లాలో ఎంపీడీవో గా పని చేస్తున్నాడు. ఇతడు కూడా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి ఆరో అటెంప్ట్‌లో 682 ర్యాంకు సాధించాడు.
