న్యూఢిల్లీ: ఇరాన్‌తో యుద్ధం కారణంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు ఇండియాకు నెల రోజులు తాత్కలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇంధన కొనుగోలుకు ఇండియాకు ఏ దేశ అనుమతి అవసరం లేదని.. తమకు ఎక్కడ తక్కువ ధరకు ఆయిల్ దొరికితే అక్కడే కొంటామని స్పష్టం చేసింది.
‘‘హార్ముజ్ మార్గంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ భారతదేశ ఇంధన సరఫరా సురక్షితంగా, స్థిరంగా ఉంది. ఇండియా ముడి చమురు వనరులను 27 నుంచి 40 దేశాలకు విస్తరించింది. బహుళ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇండియా సరసమైన ధరలు అందుబాటులో ఉన్న చోట నుంచే చమురును కొనుగోలు చేస్తుంది’’ అని తేల్చి చెప్పింది.
ఇండియాకు ఎవరి అనుమతి అక్కర్లే:
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును ఉటంకిస్తూ క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు ఇండియాకు ఎవరి అనుమతి అక్కర్లేదని భారత్ కౌంటర్ ఇచ్చింది. రష్యన్ చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం ఎప్పుడూ ఏ దేశం అనుమతిపై ఆధారపడలేదని తెలిపింది.
ఫిబ్రవరి 2026లో కూడా భారతదేశం ఇప్పటికీ రష్యన్ చమురును దిగుమతి చేసుకుంటోందని చెప్పింది. రష్యా ఇప్పటికీ భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు అని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యన్ ఆయిల్‌పై యూఎస్, ఈయూ ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉందని వివరణ ఇచ్చింది.
అసలు విషయం ఏంటంటే..?
ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఎవరూ ముడి చమురు కొనుగోలు చేయొద్దని ప్రపంచదేశాలను అమెరికా ఆదేశించింది. ఈ క్రమంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలపై వాణిజ్య సుంకాలు విధించింది. ఈ సాకుతో ఇండియాపై అమెరికా 25 టారిఫ్స్ విధించింది. దీంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా కొంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంన్నందుకు ఇండియాపై వేసిన సుంకాన్ని కూడా అమెరికా రద్దు చేసింది.
ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి, రవాణాపై గణనీయంగా పడింది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో పలు దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రష్యా నుంచి ముడిచమురు కొనేందుకు ఇండియాకు నెల రోజులు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిపై ఇండియా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఆయిల్ కొనుగోలు విషయంలో మాకు ఎవరి అనుమతి అవసరం లేదని అమెరికాకు కౌంటర్ ఇచ్చింది.
