ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీలోని భారత మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’ నిర్వహించింది. ఈ అంతర్జాతీయ సమిట్‌లో 35 దేశాల ప్రతినిధులు, 40 కంపెనీల సీఈవోలు, దేశంలోని వివిధ టెక్నికల్, ఐటీ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమిట్ గురించి మోదీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ, సమిట్‌ను నిర్వహించడంలో, వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు సరైన వసతులను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశం పరువుపోయింది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ నేతలు, యూత్ కాంగ్రెస్ చేసిన నిరసన ప్రదర్శన వల్ల దేశ ప్రతిష్ట దిగజారిందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం. సమిట్ ప్రారంభమైన ఐదవ రోజు, అంటే చివరిరోజైన ఫిబ్రవరి 20వ తేదీన యూత్ కాంగ్రెస్ తన నిరసన ప్రదర్శన నిర్వహించింది.
అంతకుముందు నాలుగురోజులుగా సమిట్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, విదేశీయుల ముందు మన దేశ పరువుపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు, వివిధ యూట్యూబ్ ఛానెళ్లు దుమ్మెత్తిపోశాయి. ఈ సమిట్ మొదటిరోజే 17 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధులు భారత మండపంలో ప్రవేశించడానికి కొన్ని గంటలపాటు కష్టపడాల్సి వచ్చింది. ప్రధాని మోదీ ఉపన్యాసం తర్వాత ఫొటో షూట్ ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్ పేరుతో ప్రధాన హాల్లో ఉన్న ఎగ్జిక్యూటర్లను, విదేశీ ప్రతినిధులను, వివిధ స్టాళ్లను ఖాళీ చేయించారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. విదేశీ ప్రతినిధులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. చాలామంది తమ విలువైన వస్తువులను కూడా కోల్పోయారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక చాలా మంది విదేశీ ప్రతినిధులు అసహనం వ్యక్తంచేస్తూ సమిట్ నుంచి వెళ్ళిపోయారు. దీనినిబట్టి సమిట్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో అర్థమవుతుంది.
గల్గోటియా వర్సిటీ ప్రదర్శనతో అప్రతిష్ట
సమిట్‌లో మన దేశ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చిన సంఘటన ఒకటి జరిగింది. సమిట్‌లో పాల్గొన్న మన దేశానికి చెందిన గల్గోటియా యూనివర్సిటీ ప్రతినిధులు చైనా దేశానికి చెందిన రోబో డాగ్‌ను తామే రూపొందించామని ప్రదర్శించారు. దీనికి ‘ఉడాయన్’ అని పేరు పెట్టారు. ఈ యూనివర్సిటీ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ నేహా ఈ రోబో డాగ్ మాన్యుఫాక్చరింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు మొత్తం తమ విద్యార్థులే క్రియేట్ చేశారని ప్రజెంటేషన్‌లో చెప్పారు. దీనిని నెటిజన్లు ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ లో ఇది అబద్ధమని తేలింది. రోబో డాగ్ పూర్తిగా చైనా దేశానిదని, చైనాకు చెందిన యూనిటిరీ రోబోటిక్ కంపెనీ తయారుచేసిన ‘Go2’ మోడల్ రోబో ఇది. భారత మార్కెట్లో ఇది రెండున్నర లక్షలకు లభిస్తుంది. దీని పేరుమార్చి గల్గోటి యూనివర్సిటీ ప్రతినిధులు సమ్మిట్‌లో ప్రదర్శించడం దేశ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చింది.
పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్
సమిట్ చివరిరోజు అఖిల భారత యూత్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేసింది. సమిట్లోకి ప్రవేశించి, యూత్ కాంగ్రెస్ నాయకులు తమ టీషర్టులను విప్పి ‘పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలకి కారణం ప్రధాని మోదీ మన దేశ రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం. పీఎం మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు పూర్తిగా సరెండర్ అయ్యారని కూడా నినాదాలు చేశారు. అప్పటికే సమిట్ నిర్వహణలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సమిట్ మొదటి రోజే కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ నిర్వహణలో జరుగుతున్న లోపాలకు క్షమాపణ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవకాశం దొరికిందే అదునుగా సమిట్ వైఫల్యాల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనపై తీవ్రమైన విమర్శలు మొదలుపెట్టింది.
నిరసన ప్రదర్శన నేరమా?
బీజేపీ నేతలైతే ఇది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్వయంగా రచించిన కుట్ర అని, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు మన దేశం ప్రతిష్టను దిగజార్చడం వీరి ఉద్దేశమని, అల్లర్లు చెలరేగడానికి కూడా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ డైరెక్షన్లోనే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. యూత్ కాంగ్రెస్ నేతలను జైలుకు పంపారు. చివరికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కూడా జైలుకు పంపారు. సమిట్ నిర్వహణ వైఫల్యాలపై నోరు విప్పని ప్రధాని మోదీ యూత్ కాంగ్రెస్ నిరసనపై మాత్రం తీవ్ర విమర్శలు చేశారు.
మోదీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి
ఐదు రోజుల ఏఐ సమిట్ నిర్వహణ లోపాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కమిటీ వేయలేదు. యూత్ కాంగ్రెస్ నిరసన వల్ల ఏఐ సమిట్ కు ఎలాంటి నష్టం జరగలేదు. పైగా వారు సమావేశ మండపంలోకి చొచ్చుకొని రాగలిగారంటే నిర్వహణలోపం స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ, బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూత్ కాంగ్రెస్‌పై నిందలు వేస్తోంది. వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు... ‘యూత్ కాంగ్రెస్ నాయకులు గబ్బర్ షేర్లు. వారిలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది. వారు మోదీ ప్రభుత్వంపెట్టే అక్రమ కేసులకు భయపడరు. దేశంకోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడరు. యూత్ కాంగ్రెస్ నాయకులు నిజమైన దేశభక్తులు’ రాహుల్ అన్న మాటలు ముమ్మాటికీ నిజం.
- నుమాన్ మహమ్మద్,
ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
