పొరుగు దేశాలపై దాడులకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ దేశంపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పటం అంటేనే.. ఇరాన్ లొంగిపోయినట్లే అన్నారాయన. అలా అని ఇరాన్ దేశంపై దాడులు ఆగవు అని.. మరిన్ని కఠినమైన దాడులు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ రాత్రికి దాడుల తీవ్రత పెరుగుతుందని కూడా హెచ్చరించారు ట్రంప్.
అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు ట్రంప్.ఇరాన్ పొరుగు దేశాలైన గల్ఫ్ దేశాకు క్షమాపణ చెప్పి లొంగిపోయిందన్నారు. అయితే ఇరాన్ పై దాడులు మాత్రం ఆగవని స్పష్టం చేశారు. ఇరాన్ లోని ఇతర సైనిక స్థావరాలపై ఈ రోజు రాత్రికి తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరిస్తూ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ లో పోస్ట్ చేశారు.
యుద్ధం కారణంగా ఇరాన్ ఇరుగుపొరుగు దేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ స్పందించారు. ఇరాన్ ఇరుగుపొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు శనివారం ఆయన క్షమాపణ చెప్పారు. తమపై దాడులు చేస్తే తప్ప ఇరుగుపొరుగు దేశాలపై ఇరాన్ ఇకపై దాడులు చేయదని అన్నారు. ఆ దేశాలపై దాడి చేసే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేశారు మసూద్.
మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు టెహ్రాన్ లొంగదని యుద్ధంపై ఇరాన్ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఇరాన్ తన పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మిడిల్ ఈస్ట్లో మళ్లీ ప్రశాంత వాతావరణానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని చెప్పారు.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇరాన్ దాడులతో ఆ దేశాల్లో విమానాశ్రయాలు మూసివేశారు. ఈక్రమంలో ఇరాన్ పై సర్జికల్ దాడులు మరింత తీవ్ర తరం చేస్తామని ట్రంప్ ప్రకటించిన తర్వాత తమ వైమానిక బలగాలను మిత్ర దేశాల ఎయిర్ బేస్ లలో మోహరిస్తోంది అమెరికా. తాజాగా బ్రిటన్ ఎయిర్ బేస్ లపై అత్యంత శక్తివంతమైన B1 లాన్సర్ బాంబర్ ను దించింది. ఈ రాత్రికి ఇరాన్ పై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించిన తర్వాత మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది.
