వడదెబ్బ బాధితుల కోసం స్పెషల్ వార్డులు..  రాష్ట్రంలోని ఐదు ప్రధాన హాస్పిటల్స్ లో ఏర్పాటు

వడదెబ్బ బాధితుల కోసం స్పెషల్ వార్డులు..  రాష్ట్రంలోని ఐదు ప్రధాన హాస్పిటల్స్ లో ఏర్పాటు
  • వేసవి నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ఆయా చోట్ల కూలింగ్ థెరపీ ట్రీట్మెంట్
  • ఎమర్జెన్సీ కేసుల మానిటరింగ్ కు.. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్
  • పీహెచ్​సీలలో అన్ని రకాల మందులు, ఓఆర్ఎస్​లు అందుబాటులో ఉండేలా చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్​కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

వడదెబ్బ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రెడీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన హాస్పిటల్స్ లో డెడికేటెడ్ హీట్ స్ట్రోక్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపుతోంది. పీహెచ్సీల నుంచి జిల్లా హాస్పిటల్స్ వరకు మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది.

మండే ఎండలకు కూల్ ట్రీట్మెంట్.. 

సాధారణ పేషెంట్లతో కలపకుండా, వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా 5 హాస్పిటల్స్ లో 5 నుంచి 10 బెడ్ల కెపాసిటీతో వార్డులను రెడీ చేస్తున్నారు. హైదరాబాద్ లోని డీహెచ్ కింగ్ కోఠి, వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్, నిజామాబాద్ జీజీహెచ్, కరీంనగర్ జీజీహెచ్, ఆసిఫాబాద్ జీజీహెచ్ లలో  వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డెడికేటెడ్ వార్డుల్లో వడదెబ్బ బాధితులకు కూలింగ్​ థెరపీ ట్రీట్మెంట్ అందిస్తారు. ఇందులో బాడీ టెంపరేచర్ తగ్గించడాని ఏసీలు, ఎయిర్ కూలర్లు , ఐస్ ప్యాక్‌‌‌‌ లు రెడీగా ఉంటాయి. బాడీలో నీటి శాతం తగ్గితే.. వెంటనే సెలైన్ ఎక్కించేలా ఐవీ స్టాండ్స్, ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉంచుతున్నారు. టెంపరేచర్ పెరగడం వల్ల కిడ్నీలు, మెదడు దెబ్బతినకుండా కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ, వైటల్స్ మానిటర్ చేయనున్నారు. ఈ వార్డులకు ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసర్ తో పాటు నర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు.

ఫీల్డ్ లోకి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్..

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కడైనా ఎమర్జెన్సీ ఏర్పడితే వెంటనే స్పందించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను కూడా ప్రభుత్వం రంగంలోకి దించబోతున్నది. ఏ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందో, ఎక్కడ వడదెబ్బ కేసులు నమోదవుతున్నాయో ఎప్పటికప్పుడు ఈ టీమ్స్ గమనిస్తుంటాయి. ఎక్కువ కేసులు వస్తున్న ప్రాంతాలకు వెళ్లి, అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. అవసరమైతే బాధితులను వెంటనే హాస్పిటల్స్ కు తరలించే ఏర్పాట్లు చేస్తాయి.108 వాహనాలు, స్థానిక హాస్పిటల్స్ తో నిత్యం టచ్‌‌‌‌లో ఉంటూ మందుల కొరత రాకుండా చూస్తాయి.

అలాగే, అన్ని పీహెచ్సీలలో 172 రకాల మందులు, సబ్ సెంటర్లలో 106 రకాల మందులు, సీహెచ్సీలలో 300 రకాల మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించాయి. ప్రతి సెంటర్‌‌‌‌ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాలని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ అధికారులకు సూచించాయి. ప్రజలు కూడా ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.

వడదెబ్బ బాధితులకు స్పెషల్ కేర్..  

వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం. బాడీ టెంపరేచర్ 104 డిగ్రీలు దాటినా.. చర్మం పొడిబారిపోయి స్పృహ తప్పినా.. అది హీట్ స్ట్రోక్ లక్షణమే. వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. వీటితోపాటు ఈసారి డెడికేటెడ్ హీట్ స్ట్రోక్ వార్డులు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. వార్డుల్లో స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తాం. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. 24 గంటలూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు.

- డాక్టర్ అజయ్ కుమార్, కమిషనర్, టీవీవీపీ-