టెహ్రాన్: యుద్ధం కారణంగా ఇరాన్ ఇరుగుపొరుగు దేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ స్పందించారు. ఇరాన్ ఇరుగుపొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు ఆయన క్షమాపణ చెప్పారు. తమపై దాడులు చేస్తే తప్ప ఇరుగుపొరుగు దేశాలపై ఇరాన్ ఇకపై దాడులు చేయదని ఆయన ప్రకటించారు. ఆ దేశాలపై దాడి చేసే ఉద్దేశ్యం తమకు లేదని మసౌద్ పెజెష్కియాన్ ఒక టీవీ ప్రసంగంలో చెప్పారు.
🚨 #BREAKING: Iran’s interim leadership council has approved that neighbouring countries will no longer be attacked unless an attack on Iran originates from them, President Masoud Pezeshkian said.
— Jan Ki Baat (@jankibaat1) March 7, 2026
అయితే.. అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు టెహ్రాన్ లొంగదని యుద్ధంపై ఇరాన్ వైఖరిని మరోసారి ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇరాన్ తన పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మిడిల్ ఈస్ట్లో మళ్లీ ప్రశాంత వాతావరణానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని పెజెష్కియాన్ చెప్పారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
అమెరికా దళాలున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లపై వచ్చిన దాడులను ఆయా దేశాలు తిప్పికొట్టాయి. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి పరంపరను అడ్డుకునే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేస్తూ దాడులను తిప్పికొడుతున్నాయి. మరోవైపు ఖతార్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తమ ఇంధన కేంద్రాలపై జరిగిన సైనిక దాడుల కారణంగా ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది.
