మిడతలొస్తున్నాయ్ జాగ్రత్త.. రాష్ట్రానికి 135కి.మీ దూరంలో మిడతల దండు

మిడతలొస్తున్నాయ్ జాగ్రత్త.. రాష్ట్రానికి 135కి.మీ దూరంలో మిడతల దండు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, వెలుగుఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న మిడతల దండు ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా దగ్గరగా వచ్చేసింది. మహారాష్ట్ర సరిహద్దులోని జిల్లాలకు కేవలం150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా వరకూ చేరింది. 3 కిలోమీటర్ల  మేర ఉన్న కోట్లాది మిడతల గుంపు ఎప్పుడు రాష్ట్రానికి చేరుతుందోనని సరిహద్దు జిల్లాల్లోని రైతుల్లో బుగులు మొదలైంది. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న రాష్ట్రానికి ఇప్పుడు మిడతల టెన్షన్‌ పట్టుకుంది. ఈ దండు రాష్ట్రంలోకి ఎంటర్‌ అవుతుందా? లేక గాలివాటంతో  ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లిపోతుందా? అనే దానిపై రెండు మూడ్రోజుల్లో క్లారిటీ వస్తుందని అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్నారు.

3 రోజుల్లో వెయ్యి కిలోమీటర్లు.. 

దేశంలో మిడతల గుంపులు ఇంత లోపలి వరకు రావడం1993 తరువాత ఇదే మొదటిసారి. గతంలో గుజరాత్‌, రాజస్తాన్‌తో పాటు హర్యానా, పంజాబ్‌కే పరిమితమయ్యేవి. జోధ్ పూర్ నుంచి మే15న ప్రారంభమైన మిడతలు.. రెండు మూడ్రోజుల్లోనే వెయ్యి కిలోమీటర్ల దూరం వచ్చాయి. మొదట మధ్యప్రదేశ్‌ వరకు వచ్చిన భారీ దండు అక్కడి నుంచి రెండు గుంపులుగా విడిపోయింది. ఒకటి ఢిల్లీ, హర్యానా, యూపీ దారి పట్టగా, మరొకటి మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రలోని అమరావతి, మోర్షీ తాలుకాకు వచ్చాయి. బత్తాయి తోటలు,  కూరగాయ పంటలను నష్ట పరిచాయి. అక్కడి నుంచి తెలంగాణకు అతి సమీపంలోని వార్థా వరకు వచ్చి మళ్లీ వెనుదిరిగి నాగ్‌పూర్‌, కాటోల్‌ ఏరియాలో పంటలపై పడ్డాయి.

ఒక్కో మిడత..750 గుడ్లు   

ఒక్క గుంపు ఒక్క రాత్రిలోనే 30 వేల మంది తినే ఆహారాన్ని తినేస్తాయి. చౌడు, తేలికపాటి, ఇసుక నేలల్లో మిడతలు గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ మిడత మూడు ఎగ్‌ పౌచ్‌లలో 750 గుడ్లు పెడుతుంది. మిడతలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాక, గుడ్ల నుంచి పిల్లలు వచ్చి పంటను నష్టపరుస్తాయి. రోజుకు 80–100 కి.మీ ప్రయాణిస్తాయి.

జూన్‌, జులైలో పంటల నష్టం

మిడతలు మన రాష్ట్రంలోకి  వస్తే.. ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పంటలపై ప్రభావం పడే చాన్స్ ఉంది. ఇంకా పత్తి, మొక్కజొన్న, వరినాట్లు మొదలుకానందున కొంత ప్రమాదం తక్కువే ఉంటుంది. కానీ ఈ మిడతలు పెట్టే గుడ్ల నుంచి పిల్లలు పుట్టి, జూన్, జులైలో పంటలపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా వరి, కంది,పెసర, జొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

మనుషులకు నో డేంజర్..

మిడతలతో మనుషులకు ప్రమాదం ఉండదు. ఇండ్ల వద్దకు వస్తే ఇరిటేటింగ్‌ గా ఉంటుంది. వీటివల్ల రోగాలు వచ్చే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని చంపేందుకు పంటలపై మందులను స్ప్రే చేస్తే.. కొంత వ్యవధి తర్వాత కోస్తే ప్రమాదం ఉండదు. కూరగాయ పంటలపై కెమికల్‌ వాడితే, నాలుగైదు రోజుల తరువాత మాత్రమే కూరగాయలు తెంపుకోవాలి.

వస్తే.. చర్యలు తీసుకోవాలిలా..

మిడతల దండు రావటాన్ని ఆపలేమని సైంటిస్టులు చెబుతున్నారు. నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. చప్పుళ్లు చేస్తే చెల్లాచెదురవుతాయి. ఎలక్ట్రానిక్‌ సౌండ్‌ సిస్టమ్‌ ద్వారా పారదోలవచ్చు. ఒక చోట  నుంచి మరో చోటికి వెళతాయి. దండు వచ్చి వెళ్లాక బంజరు భూములను దున్నితే గుడ్లు నాశనమవుతాయి. వేపనూనె, క్వినాల్ ఫాస్,  మిథైల్ పారథియాన్, ఫెనిత్రోథియాన్  కెమికల్స్ కూడా చల్లవచ్చు.

దేశంలో లక్ష ఎకరాల్లో పంటలు ఖతం..

తూర్పు ఆఫ్రికా నుంచి పాక్ మీదుగా మనదేశంలోకి వచ్చిన ఎడారి మిడతలు కనిపించిన ప్రతి పంటనూ ఖతం చేస్తున్నాయి. ఇప్పటివరకు 6  రాష్ట్రాల్లో దాదాపుగా 1.04 లక్షల ఎకరాల్లో పంటలను మిడతలు నాశనం చేశాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మోహపాత్ర వెల్లడించారు. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతలు ఇప్పుడు ఛత్తీస్ గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోకీ వచ్చే అవకాశం ఉందన్నారు.

దండు ఆగే చోటనే డేంజర్ 

మిడతలు బోర్డర్స్ లేని కీటకాలు. వీటిని అడ్డుకోలేం. ప్రస్తుతం నాగపూర్ లో పెద్ద దండు ఉంది. అక్కడ కంట్రోల్ చేస్తే సమస్య ఉండదు. దక్షిణం వైపు గాలి ఉధృతి ఉన్నందుకు వార్దా నుంచి ఆదిలాబాద్ బోర్డర్ వరకు వచ్చి వెనక్కు మళ్లింది. మిడతల దండు ఆగేచోటనే ప్రమాదం ఉంటుంది. డ్రమ్స్, డబ్బాలతో శబ్దాలు చేస్తే వెళ్లిపోతాయి.
– డాక్టర్‌ వైజీ  ప్రసాద్‌,  డైరెక్టర్‌, ఐసీఎఆర్‌ అటారీ (క్రిడా), హైదరాబాద్