తెలంగాణ ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఫాలో కావట్లేదు

తెలంగాణ ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఫాలో కావట్లేదు

హైదరాబాద్, వెలుగు: ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ను తెలంగాణ సర్కారు స్ట్రిక్ట్ గా ఫాలో కావడం లేదని ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో(పీఐబీ) పేర్కొంది. మంగళవారం ఉదయం వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని వివరిస్తూ పీఐబీ ఓ నోట్ విడుదల చేసింది. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కారు నిర్లక్ష్యాన్ని హైకోర్టు ప్రశ్నించిందని, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావుకు సమన్లు ఇచ్చి వివరణ కోరిందని తెలిపింది. రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను చాలా ఆలస్యంగా ప్రారంభించారని, ఐసీఎంఆర్ సూచనలను సరిగా పాటించడం లేదని పేర్కొంది. యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాల్సి ఉన్నా దాన్ని ఫాలో కావడం లేదని తెలిపింది. వైరస్​ సింప్టమ్స్ ఉన్న వారిని హోం ఐసోలేషన్ కు పంపుతున్నారని, వారికి తిరిగి టెస్టులు చేయడం లేదని చెప్పింది. సోమవారం వరకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన టెస్టుల సంఖ్య, పాజిటివ్ కేసులు, మరణాలు, ఇతర వివరాలను ఈ నోట్ లో పేర్కొంది.

రాష్ట్రంలో కొత్త కేసులు 1,524

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 1,524 మందికి వైరస్​ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37,745కు చేరింది. తాజాగా మరో పది మంది మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 375కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,95,024 శాంపిళ్లు టెస్ట్​ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది. మంగళవారం 13,175 శాంపిళ్లను టెస్ట్ చేయగా 11,651 మందికి వైరస్ పాజిటివ్​ వచ్చింది. 1,161 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 12,531 ఉండగా, ఇప్పటి వరకు 24,840 మంది కోలుకున్నారు. కరోనాపై పీఐబీ నోట్ ను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హెల్త్ బులెటిన్ లో ఖండించారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నామని, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను హైకోర్టు అభినందించిందని, అందుకు విరుద్ధంగా పీఐబీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా నోట్ జారీ చేసిందని తెలిపారు.

గ్రేటర్​ను వదలని కరోనా

గ్రేటర్ లో మంగళవారం కొత్తగా 815 మందికి పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 240 మంది, మేడ్చల్ జిల్లాలో 97, సంగారెడ్డి జిల్లాలో 61 చొప్పున పాజిటివ్ కేసులు వచ్చాయి.

ప్రభుత్వానికి ఇంత అహంకారమా? ..ప్రాణాలు పోతుంటే పట్టదా?