ఇంజనీరింగ్ లో కొత్త పాఠాలు

ఇంజనీరింగ్ లో కొత్త పాఠాలు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. ఇందుకోసం కొంతకాలంగా జేఎన్టీయూహెచ్ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా సిలబస్​లో మార్పులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్​లోనూ మార్పులు చేయాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిలబస్, కొత్త కోర్సులు రూపొందించనుంది. ప్రస్తుతం బీటెక్, ఎంటెక్ తదితరాల్లో 18 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలోనూ సిలబస్ మారనుంది. ఇప్పుడు ఐటీ, ఏఐ పైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. కొన్ని సంప్రదాయ కోర్సుల్లో స్టూడెంట్లు చేరకపోవడంతో అవన్నీ మరుగునపడుతున్నాయి. వాటిలో స్టూడెంట్లు చేరితే ఉపాధి లభించేలా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిలబస్​లో మార్పులు చేయనున్నారు. దీనికోసం జేఎన్టీయూలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి దేశవ్యాప్తంగా 180 మంది నిపుణులు హాజరు కానున్నారు. వీరిలో ఐఐటీ, ఎన్ఐటీ ప్రొఫెసర్లతో పాటు ఇండస్ర్టీల ప్రతినిధులు ఉన్నారు. ఈ మీటింగ్ లో సిలబస్​ను ఫైనల్ చేయనున్నారు. ఈ సిలబస్​ను 2022–23 అకడమిక్​ఇయర్ నుంచే 
అమలు చేయనున్నారు.  

మధ్యలో ఆపేసినా సర్టిఫికెట్.. 

వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే మల్టీపుల్ ఎగ్జిట్స్ అమలు చేయాలని జేఎన్టీయూ భావిస్తోంది. దీని ప్రకారం నాలుగేండ్లు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు. మధ్యలో మానేసినా చదివిన ఆ ఇయర్​ను బట్టి సర్టిఫికెట్లు అందిస్తారు. నాలుగేండ్ల ఇంజనీరింగ్​లో రెండేండ్లు చదివితే సర్టిఫికెట్, మూడేండ్లు చదివితే డిప్లొమా సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. నాలుగేండ్లు పూర్తి చేస్తే ఇంజనీరింగ్ డిగ్రీ అందిస్తారు.