బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు బెడ్లులేవ్​.. మందుల్లేవ్​

బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు బెడ్లులేవ్​.. మందుల్లేవ్​
  • కోఠి ఈఎన్​టీ దవాఖానలోసౌలతులు కరువు
  • ఒకరు డిశ్చార్జయితేనే  మరొకరికి బెడ్
  • ఆర్టీపీసీఆర్​ నెగటివ్​ రిపోర్టు ఉంటేనే అడ్మిషన్​
  • కరోనా పాజిటివ్​ ఉంటే గాంధీ హాస్పిటల్​కు 
  • ఇప్పటికీ రిపేర్​కు నోచుకోని సీటీ స్కాన్​ మెషీన్​
  • టెస్టులన్నీ బయట్నే.. ప్రైవేటులో వేలల్లో ఖర్చు 
  •     షుగర్​  టెస్టు కూడా చేస్తలేరు

హైదరాబాద్​, వెలుగు: బ్లాక్​ ఫంగస్​ ట్రీట్ మెంట్​ కోసం నోడల్​ సెంటర్​గా ఏర్పాటు చేసిన కోఠిలోని ఈఎన్​టీ హాస్పిటల్​లో  బెడ్స్​ ఫుల్ అయ్యాయి. ఒక పేషెంట్​ డిశ్చార్జయితేనే  మరొకరికి బెడ్​ లభించే పరిస్థితి నెలకొంది. పేషెంట్లకు అవసరమైన ఏ టెస్టునూ హాస్పిటల్​లో చేయడం లేదు. చివరికి షుగర్​ టెస్టును కూడా పేషెంట్లే బయటి నుంచి గ్లూకో మీటర్లు తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తోంది. ఈ దవాఖానలో  బ్లాక్​ ఫంగస్​ పేషెంట్ల కోసం 225 బెడ్స్​ ఉండగా, ప్రస్తుతం  అన్ని ఫుల్​ అయ్యాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆర్టీపీసీఆర్​ టెస్టులో నెగెటివ్​ ఉంటేనే అడ్మిట్​ చేసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ఉండి బ్లాక్​ ఫంగస్​ బారినపడ్డవాళ్లను గాంధీ హాస్పిటల్​కు పంపుతున్నారు. బ్లాక్​ ఫంగస్​ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈఎన్‌‌టీ హాస్పిటల్​లో సౌలతులు మాత్రం కల్పించడం లేదు. పాడైన సీటీ స్కాన్​ మెషీన్​ను ఇప్పటికీ రిపేర్​ చేయించలే.  ఇన్​ పేషెంట్​గా చేరినప్పటి నుంచి ఆ టెస్టులు, ఈ టెస్టులంటూ పేషెంట్లను బయటి హాస్పిటళ్లకే తిప్పుతున్నారు. లోపల ఏ టెస్టూ చేయడంలేదు. సీటీ స్కాన్​, ఎంఆర్​ఐ, గుండె, డెంటల్​ తదితర టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్​కు, కంటి చెకప్​ల కోసం సరోజినిదేవి ఆస్పత్రికి పంపుతున్నారు. ఉస్మానియాలో అన్ని టెస్టులు ఒకే రోజు కావడంలేదు. దీంతో రోజుల తరబడి టెస్టుల కోసమే తిరగాల్సి వస్తోందని, ఫలితంగా ట్రీట్​మెంట్​కు ఆలస్యమవుతోందని పేషెంట్లు అంటున్నారు. చాలా మంది ప్రైవేట్​ ల్యాబ్స్​లో టెస్టులు చేయించుకుంటున్నారు. సిటీ స్కాన్​, ఎంఆర్​ఐ స్కాన్​, హార్ట్‌‌  చెకప్​, బ్లడ్​ టెస్టులు ఇలా అన్నింటికీ కలిపి ఒక్కో పేషెంట్​కు రూ. 15వేల నుంచి 20 వేల దాకా ఖర్చవుతోంది. ఇప్పటికే కరోనా వల్ల లక్షలకు లక్షల అప్పులు చేసి దవాఖాన్లలో చూపెట్టుకున్న తాము ఇప్పుడు బ్లాక్​ ఫంగస్​ వల్ల మరింత  అప్పులపాలవుతున్నామని పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఈఎన్ టీ దవాఖాన  ప్రభుత్వాసుపత్రిగా కనిపిస్తోందని, ఒక్క టెస్టు కూడా చేయడం లేదని వారు అంటున్నారు. 

షుగర్​ టెస్టులూ చేస్తలె

బ్లాక్​ ఫంగస్​ బారిన పడుతున్నవాళ్లలో ఎక్కువ మంది షుగర్​ పేషెంట్లే ఉంటున్నారు. వీళ్లకు  రెండు, మూడు పూటల షుగర్​ లెవల్స్​ చెక్​ చేయడం తప్పనిసరి. కానీ హాస్పిటల్​లో  చేరిన పేషెంట్లకు కనీసం షుగర్​ టెస్టులు కూడా చేయడంలేదు. ఎవరికి వాళ్లే  టెస్టులు చేసుకోవాలని, ఇందుకోసం గ్లూకో మీటర్లు తెచ్చుకోవాలని స్టాఫ్​ చెప్తున్నారని పేషెంట్లు అంటున్నారు.  

ఇంజక్షన్లకూ షార్టేజీ

బ్లాక్​ ఫంగస్ బారిన పడ్డోళ్లకు  లైపోజోమల్, యాంఫోటెరిసిన్  బి, పోసకోనజోల్, ఐసవుకోనజోల్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. మార్కెట్​లో ఇంజక్షన్లు దొరకట్లే..బ్లాక్​ మార్కెట్​లో  కొనలేక చాలామంది ఈ ఇంజక్షన్ల కోసమే ఈఎన్​టీకి వస్తున్నారు. అయితే హాస్పిటల్​లో కూడా ఇంజక్షన్లకు షార్టేజీ ఉంది. అత్యవసరమైనవాళ్లకే ఇస్తున్నారు. అడ్మిషన్​ కౌంటర్​ వద్ద  యాంఫోటెరిసిన్  ఇంజక్షన్లు లేవని స్టిక్కర్​ అంటించారు. 

బెడ్​ కోసం పడిగాపులు

బ్లాక్​ ఫంగస్​ కేసులు వస్తుండటంతో ఈఎన్ టీలో ముందుగా 30  బెడ్లు  ఏర్పాటు చేశారు. బాధితుల సంఖ్య పెరగడంతో ఆ తర్వాత నోడల్​ సెంటర్​ గా మార్చి  బెడ్స్​ని పెంచారు. ప్రస్తుతం 225 బెడ్స్​ ఉండగా.. అవన్నీ ఫుల్​ అయ్యాయి. ప్రస్తుతం ఒక పేషెంట్​ బయటకు వస్తేనే మరో పేషెంట్​కు అడ్మిషన్ దొరికే పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది పేషెంట్లు హాస్పిటల్​ ప్రాంగణంలోనే పడుకుంటున్నారు.

టెస్టులకు 20 వేలు ఖర్చయినయ్​

కరోనా వచ్చి తగ్గిందనుకునే టైంలో బ్లాక్​ ఫంగస్​ వచ్చింది. ట్రీట్ మెంట్​ కోసం ఈఎన్​టీ హాస్పిటల్​కు వస్తే ఇక్కడ టెస్టులు చేస్తలేరు. సీటీ, ఎంఆర్​ఐ స్కానింగ్​లు, గుండె, డెంటల్​ టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్​కు పంపుతున్నరు. అక్కడ గుండె టెస్టులకే ఒకరోజు గడిచింది. డెంటల్​కి సంబంధించి తెల్లారి రమన్నరు. ఇంకా కన్ను టెస్టులు చేసుకోవాల్సి ఉంది. దాని కోసం సరోజిని హాస్పిటల్​కు వెళ్లమన్నరు. ఇక తిరిగే ఓపికలేక స్కానింగ్​లు బయటనే తీయించుకున్నం. ఇంకొన్ని టెస్టులు కూడా చేయించినం. వీటికే రూ. 20 వేలు ఖర్చయినయ్. ఈ దవాఖాన్ల షుగర్​ టెస్టులు కూడా చేస్తలేరు. గ్లూకో మీటర్ కొనుక్కొని మేమే చెక్​ చేసుకుంటున్నం.

– తారా, పేషెంట్, కరీంనగర్​ జిల్లా వాసి

మరిన్ని బెడ్స్ పెంచుతం

ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య పెరిగింది. దీంతో బెడ్స్​ ఫుల్​ అవుతున్నయ్. మరో 50 బెడ్స్​ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. సీటీ స్కాన్ మెషీన్​ రిపేర్​ త్వరలో పూర్తవుతది. పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నం. ఎంతమంది పేషెంట్లు వచ్చిన ట్రీట్ మెంట్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 
- డాక్టర్​ మనీష్ గుప్తా,    సీఎస్​ ఆర్​ఎంవో, ఈఎన్​టీ హాస్పిటల్​