వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తినొచ్చు..

వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తినొచ్చు..

సమ్మర్​తో పోలిస్తే వర్షాకాలంలో పండ్లు తినడం చాలావరకు తగ్గిస్తారు. చినుకులు పడడం మొదలైందంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చెట్లు, తీగలు, గడ్డి మొక్కలేకాదు.. పురుగులు, కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్​ వంటి సూక్ష్మజీవులు కూడా ప్రాణం పోసుకుంటాయి. ఒక్కసారిగా వాటి సంఖ్య పెరిపోతుంది. వాతావరణం తేమగా ఉండడం వాటికి మరింత అనుకూలం. ఎక్కడ చూసినా రకరకాల పురుగులు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కంటికి కనిపించేవైతే.. కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మజీవులు కూడా చెట్లు, పుట్టల పైకి చేరతాయి. అందుకే ఆ చెట్ల నుంచి వచ్చే పండ్లను వర్షాకాలంలో తినొద్దని చెబుతారు.పండ్లను వేడిచేసుకొని, ఉడకబెట్టుకొని తినలేం. అలాగే తినాలి. చల్లటి నీళ్లతో ఎంత కడిగినా వాటిపై ఉన్న సూక్ష్మజీవులు నాశనం కావు. అందుకే చినుకులు పడడం మొదలైతే… మామిడి పండ్లే కాదు ఏ పండ్లూ తినొద్దని చెబుతారు పెద్దలు.

జాగ్రత్తలు తీసుకుంటే సరి

నిజానికి పండ్లు తినడానికి ఒక కాలమంటూ ఏదీ లేదు. ఏ సీజన్​ పండ్లను ఆ సీజన్​లోనే తిని ఎంజాయ్​ చెయ్యాలి. వాటి నుంచి వచ్చే పోషకాలను శరీరానికి అందేలా చూడాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేదంటే.. పండ్ల నుంచి పోషకాలకు బదులుగా రోగాలు వస్తాయి. అందుకని ఉప్పు వేసిన నీళ్లలో పండ్లను కొంచెంసేపు ఉంచి, తరువాత కడగాలి. వెనిగర్​ వేసిన నీళ్లలో కూడా పండ్లను కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత తినొచ్చని చెబుతారు. అయితే దానికంటే ఉప్పునీళ్లతో కడిగి తినడమే బెటర్. ​

సూక్ష్మజీవులను పూర్తిగా చంపేసే శక్తి ఉప్పు నీళ్లకు ఉంటుంది. అందుకే కదా… కరోనా వైరస్​ బారిన పడకుండా మార్కెట్​ నుంచి తెచ్చిన కూరగాయలను ఉప్పునీళ్లతో శుభ్రంగా కడిగి తింటున్నాం. జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా పండ్లు తినొచ్చు. మిగతా పండ్ల సంగతేమో కానీ, మామిడి పండ్లకు మాత్రం దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే చినుకులు పడడం మొదలైందంటే మామిడి పండ్లలో పురుగు పడుతుంది. మామిడి పండు పైనుంచి చూసేందుకు బాగానే ఉన్నా లోపల పురుగులుంటాయి. సో వర్షం పడ్డాక మామిడి పండు తినకపోవడమే బెటర్​.

బొప్పాయి

బొప్పాయి పండులో ఎ, బి, సి, డి విటమిన్​లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బొప్పాయిలోనే ప్రత్యేకంగా ఉండే పపెయిన్ అనే పదార్థం డైజెషన్​లో ఉన్న ఇబ్బందులకి చెక్​ పెడుతుంది. పొట్టను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి పండును గుజ్జుగా చేసి చిన్న పిల్లలకు నాలుగో నెలనుంచి తినిపించొచ్చు. ఇందులో కొలెస్ట్రాల్​, కేలరీలు రెండూ తక్కువే. ఊబకాయం ఉన్నవాళ్లు కూడా బొప్పాయిని తినొచ్చు. కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులో ఉండే బీటా కెరోటిన్‌ అడ్డుపడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్– సి దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది విటమిన్‌– బి . కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పీచు వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధికంగా విటమిన్ –ఎ లభిస్తుంది.
ఇవన్నీ రెగ్యులర్​గా దొరికే పండ్లే అయినప్పటికీ వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తినడం వల్ల సీజన్​ ఛేంజ్​ వల్ల వచ్చే హెల్త్​ ప్రాబ్లమ్స్​ రాకుండా ఉంటాయి.

దానిమ్మ

  • దానిమ్మ పండు నిండా గింజలేకాదు.. గింజ గింజలో పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. అవి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.
  • అంటువ్యాధులు, అలర్జీల వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే దానిమ్మను డైట్​లో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఓ పొరను ఏర్పరుస్తాయి. ఈ పొర కంటికి కనిపించదు. పొడి చర్మం, వయసు మీద పడటం వల్ల వచ్చే మచ్చలు, హైపర్ -పిగ్మెంటేషన్ వంటి సమస్యలను చాలా త్వరగా పరిష్కరిస్తుంది.
  • దానిమ్మపండులో శరీరానికి సరిపడా విటమిన్ –ఇ ఉంటుంది. ఒక కప్పు దానిమ్మ రసంలో 1.8 మిల్లీగ్రాములు విటమిన్​–ఇ ఉంటుంది.
    దానిమ్మను జింక్​ లోడెడ్​ అని కూడా చెబుతారు. స్కిన్​సెల్స్​ డెవలప్​మెంట్​లో జింక్​ ‘కీ’ రోల్​ పోషిస్తుంది. ఒక దానిమ్మ పండులో1.1 మిల్లీగ్రాముల జింక్​ ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి అవసరమైన జింక్​లో15శాతాన్ని భర్తీ చేస్తుంది.
  • ఇందులో కాపర్​ కూడా ఎక్కువే. శరీరంలో మెలనిన్​ ఉత్పత్తికి సాయపడుతుంది. కళ్లు, స్కిన్​, హెయిర్​ ఇలా అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక కప్పు దానిమ్మ రసం తీసుకోవడం అంటే 500 మైక్రోగ్రాముల కాపర్​తో సమానం.
  • గాయాలను మాన్పడంలో దానిమ్మకు మించింది లేదు. కణాలు రీజనరేట్​ కావాలంటే అవసరమైన అన్ని ఎలిమెంట్స్​ దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి.
    శరీరంలో హార్మోన్ల సరైనపాళ్లలో లేకపోవడం కారణంగా మొటిమలు ఏర్పడతాయి. దానిమ్మ తినటం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. అందుకు కారణం దానిమ్మలో ఉండే విటమిన్​–సి. ఇది నూనె గ్రంధుల్లో జిడ్డు పేరుకుపోకుండా చేస్తుంది.
  • దానిమ్మ పండులో ఉండే ఐరన్​ నిల్వలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆక్సిజన్​ రవాణాలో ఉపయోగపడే హిమోగ్లోబిన్​ శాతం పెరగడానికి దానిమ్మలోని ఐరన్​ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ఇవేకాకుండా క్యాన్సర్​ను నిరోధించడంలో, జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో, ఎముకలను బలంగా మార్చడంలో దానిమ్మలోని ఔషధ గుణాలు ఎంతగానో సాయపడతాయి.

అరటిపండ్లు

హెల్దీ ఫుడ్స్​ రుచిగా ఉండవు. కానీ అరటిపండు రుచితోపాటు పోషకాలను కూడా కలిగి ఉంటుంది. రోజూ ఒక అరటిపండు తింటే బరువు కంట్రోల్​లో​ ఉంటుంది. అరటిపండులో కొలెస్ట్రాల్​ తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని వెయిట్​ మేనేజ్​మెంట్​ ఫుడ్​ అంటారు. అరటిపండ్లను తినేవాళ్లు చాలా తక్కువగా జబ్బుల బారిన పడతారు. త్వరగా జీర్ణమై అన్ని పోషకాలను అందించే ప్రాపర్టీస్​ అరటిపండులో ఉన్నాయి. అందుకని పసివాళ్లకు కూడా ఈ పండు తినిపించొచ్చు. అంతేకాదు.. పెద్దవాళ్లకు కూడా అవసరమైన అన్ని పోషకాలు అరటిపండు అందిస్తుంది. షుగర్​ పేషెంట్లు అరటిపండ్లు తినాలనుకుంటే మాత్రం డాక్టర్​ సలహా మాత్రం తప్పనిసరి. ఎందుకంటే షుగర్​ పేషెంట్లలో అందరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు.

యాపిల్​

మిగతా పండ్లతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువే అయినప్పటికీ వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫ్రూట్​ ఇది. రోజూ ఒక యాపిల్​ తింటే డాక్టర్​ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదనే మాట మనమందరం వినే ఉంటాం. యాపిల్​లో విటమిన్– సి ఉంటుంది. అందుకే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్​లా పని చేస్తుంది. ఇందులో ఉండే బి– కాంప్లెక్స్, విటమిన్స్ ఎర్ర రక్త కణాల పెరుగుదలకు, నాడీ వ్యవస్థ పనిచేసేందుకు సాయపడతాయి. ఫైబర్ కూడా ఉండటం వల్ల రోగాలు దరిచేరనీయదు. మీడియం సైజ్​ యాపిల్​లో 95 కిలో కేలరీల ఎనర్జీ ఉంటుంది. అందుకే అనారోగ్యంతో ఉన్నవాళ్లు తప్పనిసరిగా తినాల్సిన ఫ్రూట్​ ఇది. అంతేనా… బరువు తగ్గాలనుకునేవాళ్లు భోజనానికి ముందు ఒక యాపిల్​ తింటే త్వరగా బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, షుగర్​ కంట్రోల్​లో ఉండాలన్నా రోజూ యాపిల్​ తినాలి. కొన్ని స్టడీల ప్రకారం​ క్యాన్సర్​ కణాల పెరుగుదలను కూడా యాపిల్ అడ్డుకుంటుందని వెల్లడైంది. అంతేకాకుండా వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతుంటాయి. అటువంటివాళ్లు రోజూ ఒక యాపిల్​ తింటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. మెదడు పనితీరును కూడా యాపిల్​ మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లల్లో మెదడు ఎదుగుదలకు, జ్ఞాపకశక్తికి, ఎముకల దృఢత్వానికి, ఊబకాయాన్ని తగ్గించేందుకు, జీర్ణసమస్యలు రాకుండా ఉండేందుకు, మలబద్ధకాన్ని నివారించేందుకు యాపిల్​ చాలా బాగా పనిచేస్తుంది.