చదువు రాని సన్నాసులు అన్నారు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తే.. శభాష్ అంటున్నారు

చదువు రాని సన్నాసులు అన్నారు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తే.. శభాష్ అంటున్నారు

ఏరా గాలికి తిరక్కపోతే చదువుకోవచ్చు కదా.. చదువూ సంధ్యా లేని సన్నాసులు అంటూ అందరూ తిట్టిపోశారు. ఆ కుర్రోళ్లు మాత్రం ఏం చేస్తారు.. చదువు అబ్బకపోతే. కొంత మంది అయితే చదువూ సంధ్యా లేని సన్నాసులు.. ఆకతాయిలు అంటూ తిట్టిపోశారు. చదువు అబ్బకపోవటంతో.. వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తున్నారు. ఇప్పుడు ఆ చదువూ సంధ్యా లేని వాళ్లను చూస్తే.. చదువుకుని.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. మీ పనే హాయిగా ఉందిరా.. శభాష్ శభాష్ అంటున్నారు. కాలం అందరికీ ఎప్పుడో అప్పుడు.. ఏదో రూపంలో ఇస్తుంది అనటానికే ఇదే ఎగ్జాంపుల్. ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా అదృష్టం ఇస్తే.. వీళ్లకు మాత్రం టమాటాల రూపంలో ధనలక్ష్మి ఇంటికి వచ్చింది. మూడు నెలల్లోనే లక్షాధికారులు అయ్యారు.. పదేళ్లు ఐటీ ఉద్యోగం చేసి సంపాదించేంత డబ్బును.. గ్రామంలో ఉండి.. సంపాదించేశారు.. 

 దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల రైతులు.. టమాటా సాగుపై వచ్చిన డబ్బుతో ఉన్న అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చేస్తున్నారు. లగ్జరీ ఇళ్లు, వాహనాలను సొంతం చేసుకుంటున్నారు. అప్పటి వరకూ వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వం అన్నవాళ్లు కాస్త.. మా అమ్మాయిని చేసుకోండి అంటూ యువరైతుల ఇంటికి కబుర్లు పంపిస్తున్నారు. కర్ణాటక చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా టమాటా సాగుతో.. లక్షలు గడించారు. చదువూ సంధ్య లేకుండా పొలం పనులు చేసుకుంటున్నారన్న ఆ ఊరి వాళ్ల నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. 

 కర్ణాటకలోని చామరాజనగర జిల్లా లక్ష్మీపురకు చెందిన రాజేశ్‌, నాగేశ్‌ అనే అన్నదమ్ములు టమాటా సాగు చేసి లక్షాధికారులుగా ఎదిగారు. మూడేళ్ల కిందటే వీరిద్దరూ చదువు మానేసి.. తమకున్న 2 ఎకరాల పొలంలోనే వ్యవసాయ పనుల్లోకి దిగారు. టమాటాకు చక్కని ధర వస్తుందని ఊహించి, తమ పొలం పక్కనే గత ఏడాది మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. మొత్తం 12 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. పంట దిగుబడితో పాటు ధర కూడా ఎక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు 2 వేల బాక్సుల టమాటా విక్రయించి..రూ.40 లక్షలకుపైగా ఆదాయాన్ని గడించారు. మిగిలిన పంటను కూడా అమ్మి రూ. 80 లక్షలు సంపాదిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.  

 గత రెండేళ్లుగా రాజేష్‌ కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయడం కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అయితే చదువుకున్న, ఉద్యోగంలో బాగా సెటిల్‌ అయిన అబ్బాయే కావాలని అమ్మాయిల తరపు వాళ్లు తెగేసి చెప్పడంతో రాజేశ్ కు సంబంధం దొరకడం కష్టంగా మారింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేష్‌... ఎలాగైనా భవిష్యత్తులో గట్టిగా ఎదగాలని.. ధైర్యం చేసి మొత్తం 12 ఎకరాల పొలంలో టమాటా సాగు చేశాడు.   టమాటా వ్యాపారం కారణంగా అతనికి రూ. కోటి ఆదాయం అందింది.   మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేశారు. దీంతో వ్యవసాయం చేసే వారికి పిల్లను ఇవ్వబోం అనే వారికి గట్టి సమాధానం చెప్పాలని అనుకున్న రాజేష్‌ సంకల్పం ఫలించడంతో అతను ఆనందలో మునిగి తేలుతున్నాడు.