వామ్మో టమాట! ధర చూస్తేనే బెంబేలు

వామ్మో టమాట! ధర చూస్తేనే బెంబేలు
  • చిక్కుడు, క్యాప్సికం, బీన్స్ కూడా

హైదరాబాద్‌‌, వెలుగు: బీర, బెండకాయ బెంబేలెత్తిస్తున్నయి. పచ్చి మిర్చి పరేషాన్ చేస్తున్నది. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, కాకర కాక పుట్టిస్తున్నయి. ఇగ టమాటైతే అక్షరాలా టాప్ లేపుతున్నది. అదీ ఇదీ అని లేదు. కూరగాయలన్నీ మస్తు పిరమైనయి. ఒకటీ అరా తప్ప అన్నీ కిలో 60 రూపాయల పైన్నే పలుకుతున్నయి. గురువారం హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలుచోట్ల టమాట కిలో ఏకంగా రూ.వంద దాటింది. చిక్కుడు, క్యాప్సికం కూడా రూ.100 పలుకుతున్నయి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలకు జనం బేజారైతున్నరు. జేబులు ఖాళీ చేసుకున్నా సగం సంచికి కూడా వస్తలెవ్వని నిట్టూరుస్తున్నరు. వానలతో పంటలు దెబ్బ తిని దిగుబడి తగ్గడం, కార్తీకం డిమాండ్ తోడవడమే ధరలకు కారణమని ఎక్స్ పర్టులు అంటున్నరు. నెలాఖరుకల్లా దిగుబడి ఇంకా తగ్గేలా ఉంది. యాసంగి ఇంకా విత్తనాల దశలోనే ఉంది. కాబట్టి ఇంకొద్ది రోజులు ధరలు ఇట్లే ఉండొచ్చంటున్నరు.

వామ్మో టమాట!
హన్మకొండ రైతు బజార్లో గురువారం కిలో టమాటా రూ.90 పలికింది. బహిరంగ మార్కెట్లో 100 దాటింది. హోల్‌‌ సేల్‌‌ మార్కెట్లోనే కిలో రూ.48 పలికింది. గత మే లో కిలో రూ.6 ఉన్నది కాస్తా 8 రెట్లు పెరిగింది. బెండకాయలు హోల్‌‌సేల్లో రూ.50, బయట రూ.80 దాకా పలుకుతున్నాయి. ఫ్రెంచ్‌‌ బీన్స్‌‌ అయితే హోల్‌‌సేల్లోనే రూ.50 ఉండగా, బయట రూ.120 దాకా ఉంది.

వానల ఎఫెక్ట్‌‌..
అక్టోబర్లో వానల వల్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. యాసంగి సాగు షురూ కాక దిగుబడీ లేదు. భారీ వానలతో పొరుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దాంతో రాష్ట్రంలో ధరలు మండుతున్నాయి. నెలలోనే భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లు, మార్కెట్లకు కూరగాయలు రవాణా చేసే హైదరాబాద్‌‌ బోయిన్‌‌పల్లి హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌కు అక్టోబర్ తో పోలిస్తే జిల్లాల నుంచి సరఫరా 45 శాతానికి తగ్గింది. రోజుకు 800 పై చిలుకు లోడ్లు వచ్చేవి గురువారం 435 లోడ్లే వచ్చాయి. దీనిలోనూ సగానికి పైగా లోడ్లు పక్క రాష్ట్రాలవే. అన్ని కూరగాయలూ కలిపి 23,306 క్వింటాళ్లే వచ్చాయి. ఆలుగడ్డ 1519 క్వింటాళ్లు, బీరకాయ 184, ఫీల్డ్‌‌ బీన్స్‌‌ 109 క్వింటాళ్లు తగ్గాయి.టమాట రోజుకు 4 వేల నుంచి 8 వేల క్వింటాళ్లు వచ్చేది బుధవారం 900 క్వింటాళ్లే వచ్చింది. గురువారం కూడా 1,500 క్వింటాళ్లకే పరిమితమైంది.